మండలాల వారీగా ఎన్నికల వివరాల పట్టిక
● తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
● రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కడప సెవెన్‌రోడ్స్ : తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో రాజంపేట, బద్వేలు రెవెన్యూ డివిజన్లలోని మండలాలతోపాటు కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ షెడ్యూల్...
ఈనెల 15న రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేస్తారు. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 17వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19న తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత ఆర్డీఓ వద్ద అప్పీలు చేసుకోవచ్చు. 20వ తేదీ అప్పీళ్లను పరిష్కరిస్తారు. 21వ తేది మధ్యాహ్న 3.00 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
26న పోలింగ్
ఈనెల 26వ తేదీ ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే ఈనెల 27వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు రీపోలింగ్ ఉంటుంది.
తొలి విడత ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల, శ్రీ అవధూత కాశీనాయన, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లో మొత్తం 176 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు, 1,768 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 3,71,999 మంది ఓటర్లు ఈ విడతలో ఓటు వేయనున్నారు.
బ్యాలెట్ పెట్టెలు, ఎన్నికల సామగ్రి సిద్ధం
తొలి విడతలోని 176 గ్రామ పంచాయతీలకు 1,788 బ్యాలెట్ పెట్టెలు అవసరమని గుర్తించారు. వీటిలో 605 పెట్టెలు ఇప్పటికే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం స్వీకరణ, బ్యాలెట్ పెట్టెల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా 39 పంపిణీ కేంద్రాలు, 39 స్వీకరణ కేంద్రాలు, 39 భద్రపరిచే గదులను గుర్తించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని సకాలంలో అందించడంతో పాటు పోలింగ్ అనంతరం వాటిని భద్రంగా స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
14,702 మంది సిబ్బంది నియామకం
జిల్లాలోని మొత్తం 6,136 పోలింగ్ కేంద్రాలకు 6,136 మంది ప్రిసైడింగ్ అధికారులు, 8,566 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి 14,702 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ నిర్వహణ, విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 39 మండలాల్లో శిక్షణ కేంద్రాలను గుర్తించి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టారు.
మండల పేరు సర్పంచ్ మొత్తం పోలింగ్
స్థానాలు వార్డులు కేంద్రాలు
రాజంపేట 25 242 242
సిద్ధవటం 18 168 168
పోరుమామిళ్ల 17 180 200
కాశినాయన 17 160 160
కలసపాడు 13 130 130
ఒంటిమిట్ట 13 130 30
వీరబల్లి 12 130 130
అట్లూరు 12 116 116
సుండుపల్లి 11 126 126
నందలూరు 11 120 120
బద్వేలు 10 98 98
బి.కోడూరు 10 98 98
గోపవరం 7 70 70
మండలాలు : 13
గ్రామ పంచాయతీలు : 176
మొత్తం వార్డులు : 1,768
పోలింగ్ కేంద్రాలు : 1,788
ఓటర్లు : 3,71,999
ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లావ్యాప్తంగా 129 జోన్లను గుర్తించి 138 మంది జోనల్ అధికారులను నియమించారు. అలాగే పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి రవాణా, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం 256 రూట్లను గుర్తించి 272 మంది రూట్ అధికారులను ఏర్పాటు చేశారు. జిల్లా లో 185 క్లస్టర్లను గుర్తించి ఎన్నికల నిర్వహణకు అవ సరమైన అధికారులను నియమించడం జరిగింది.


