భారీగా తగ్గిన చిరుధాన్యాల సాగు ! | - | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన చిరుధాన్యాల సాగు !

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● వర్షాభావ పరిస్థితుల్లోనూ విస్తరించని మిల్లెట్స్‌ సాగు

● 9,892 హెక్టార్లకు గాను.. 1,905 హెక్టార్లకే పరిమితం

● జొన్న 1,893, సజ్జ 12 హెక్టార్లలోనే సాగు..

సున్నాకు చేరిన రాగి, కొర్ర, అరిక, సామలు

● ప్రభుత్వ ప్రోత్సాహం, మద్దతు ధర లేక అన్నదాతల విముఖత

కడప అగ్రికల్చర్‌: ఒకప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల ప్రధాన ఆహారంగా, కరవు కాలంలోనూ రైతులకు అండగా నిలిచిన చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగు నేడు జిల్లాలో పూర్తిగా చితికిలపడింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన తరుణంలో ప్రత్యామ్నాయ పంటలుగా చిరుధాన్యాల సాగు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా విస్తీర్ణం దారుణంగా పడిపోయింది.

లక్ష్యానికి ఆమడదూరంలో సాగు..

జిల్లా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం చిరుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9,892 హెక్టార్లు కాగా, ప్రస్తుతం కేవలం 1,905 హెక్టార్లలో మాత్రమే సాగవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

జొన్నకే పరిమితం: సాగవుతున్న 1,905 హెక్టార్లలో అత్యధికంగా 1,893 హెక్టార్లలో ఒక్క జొన్న పంట మాత్రమే ఉంది.

నామమాత్రంగా సజ్జ: సజ్జ పంట సాగు కేవలం 12 హెక్టార్లకే పరిమితమైంది.

సున్నాకు చేరిన ఇతర పంటలు: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి, కొర్ర, ఆరిక, సామలు వంటి పంటల సాగు జిల్లాలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అటకెక్కినా..

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు పూర్తిగా అటకెక్కాయి. దీంతో సాధారణ పంటలతో పాటు మిల్లెట్స్‌ సాగు కూడా అరకొరగానే సాగింది. సాధారణంగా నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో అతి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలను సాగు చేయాల్సి ఉంటుంది. కానీ, సాధారణ రోజుల్లోనే వీటిపై ఆసక్తి చూపని అన్నదాతలు, ప్రస్తుత కరవు పరిస్థితుల్లోనూ వీటిని సాగు చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.

జంక్‌ఫుడ్‌ నుంచి

మళ్లీ చిరుధాన్యాల వైపు..

మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు ప్రతి ఇంటా చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా ఉండేది. నేటి ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడిలో పడి ప్రజలు వేళాపాళా లేకుండా జంక్‌ఫుడ్‌ తినడానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగాలతో సతమతమవుతున్న జనం.. ఇప్పుడు మళ్లీ పోషక విలువలున్న ఆరోగ్యకరమైన ఆహారం కోసం చిరుధాన్యాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

మద్దతు ధర కరువు..

అతి తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో స్థానిక వాతావరణానికి అనుకూలంగా పెరిగి, నేల సారాన్ని కాపాడే గుణం చిరుధాన్యాలకు ఉంది. ఒకవైపు మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ పెరుగుతున్నా, ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం, గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర లేకపోవడంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.ఆధునిక పోకడలు, ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాలో సంప్రదాయ చిరుధాన్యాల సాగు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కరవు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేలా చిరుధాన్యాల విత్తనాలను రాయితీపై అందించి, కనీస మద్దతు ధర కల్పిస్తేనే సంప్రదాయ పంటలకు పూర్వ వైభవం వస్తుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement