కడప సెవెన్‌రోడ్స్ : సెక్షన్ 51 విచారణ అధికారి సమర్పించిన నివేదికపై ఈనెల 15వ తేదీ నిర్వహించాలనుకున్న అత్యవసర సర్వసభ్య సమావేశం రద్దు చేసినట్లు జిల్లా సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులు జి.వెంకటరెడ్డి తె లిపారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందువల్ల డివిజనల్ సహకార అధికారి మౌఖిక సూచనల మేరకు సమావేశాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన కమలాపురి విశ్వనాథ్‌ను రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కోవాసెంట్‌కు
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రముఖ సంస్థ ‘కోవాసెంట్ టెక్నాలజీస్’ నిర్వహించిన ఇంటర్వ్యూలలో 8 మంది విద్యార్థులు ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలు సాధించిన ఎం.స్నేహ, ఎం.వందన, డి.విష్ణు వర్ధన్, టి.శ్రీధర్ బాబు, పి.వెంకట మానస, పి.పవిత్ర, పి.సాయి కులదీప్, మహమ్మద్ సాజిద్‌లను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయ్ ప్రకాష్, పరిపాలన అధికారి రత్న కుమారి శుక్రవారం అభినందించారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ప్లేస్‌మెంట్ అధికారులు సత్యానందరామ్, సుందర్, సీఎస్‌ఈ హెచ్‌ఓడీ డాక్టర్ పెనుగొండ రవికుమార్ పాల్గొన్నారు.
బాక్సింగ్‌లో ప్రతిభ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విద్యార్థినులు అంతర్ జిల్లా స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన వై.లావణ్య, ఏ.హరిత పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటారు. కడపలోని వివేకానంద కళాశాలకు చెందిన వై.లావణ్య 19 సంవత్సరాల బాలికల 60–64 కేజీల విభాగంలో రజత పతకం, లింగాల మండలం బీఆర్ అంబేడ్కర్ పాఠశాలకు చెందిన ఏ.హరిత 43–47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారు. వై.ప్రసన్న కోచ్‌గా వ్యవహరించిన ఈ జట్టు ప్రతిభపై జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేష్, ఎం. విజయ భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడపలో విజేతలను అభినందించారు. రాబోయే రోజుల్లో వీరు బంగారు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.


