● ఆనాడు సీటు వదులుకుని..
నేడు డాక్టరేట్ అందుకుని!
● పులివెందులకు చెందిన
డాక్టర్ వాసుదేవరెడ్డి
స్ఫూర్తి ప్రయాణం
కడప ఎడ్యుకేషన్/కడప సిటీ: ఆర్థిక ఇబ్బందులతో ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాలలో చేరలేకపోయిన యువకుడు నేడు అదే రంగంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆయనే పులివెందులకు చెందిన డాక్టర్ వాసుదేవరెడ్డి. ‘బసాల్ట్ (అగ్నిశిల) పీచుతో బలోపేతం చేసిన పునర్వినియోగ కాంక్రీట్ దృఢత్వంపై అధ్యయనాలు – ఒక ప్రయోగాత్మక పరిశోధన’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఇటీవల పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది.
భార్య, స్నేహితుల అండతో
కలను నెరవేర్చుకుని..
కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న ఉద్యోగంలో చేరినా, వాసుదేవరెడ్డి తన ఇంజినీరింగ్ కలను మాత్రం వదులుకోలేదు. వివాహానంతరం ఉద్యోగం చేస్తున్న భార్య సహకారం, స్నేహితుల ప్రోత్సాహంతో ఏకంగా ఆరేళ్లు సెలవు తీసుకుని బీటెక్, ఎంటెక్‌లను రెగ్యులర్ విద్యార్థిగా పూర్తి చేశారు. అనంతరం పదోన్నతి పొంది తిరిగి విధుల్లో చేరారు.
రైతుల కోసం ఆరాటం..
స్వగ్రామమైన పులివెందులలో నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టాక, తన ప్రాంతానికి శాశ్వత మేలు చేయాలని సంకల్పించారు. నేషనల్ వాటర్ అకాడమీలో పొందిన శిక్షణను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేశారు. పైడిపాలెం లిఫ్ట్ పథకం, ఎల్‌ఐ–1 నుంచి ఎల్‌ఐ–5 వరకు అడ్డంకులను అధిగమించి సీబీఆర్ డ్యామ్‌కు తొలిసారి నీటి సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించారు. లింగాల కుడి కాలువపై 11 లిఫ్టుల పునరుద్ధరణతో పాటు, యురేనియం ప్రభావిత ప్రాంతాల రైతుల కోసం సీబీఆర్–ఎర్రబల్లి పథకం, జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్టుల రూపకల్పనలో విశేష సేవలందించారు. అలాగే మూడు దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న ఉప్పలూరు, తాడుకువాగు లిఫ్టుల సాకారానికి అహర్నిశలు కృషి చేశారు.
చారిత్రక కట్టడాలకు
అంతర్జాతీయ గుర్తింపు కోసం..
పోరుమామిళ్ల చెరువు, గుండ్లకమ్మ ప్రాజెక్టు, కేసీ కెనాల్ శాసనాలను వెలికితీసి, ఆ చారిత్రక సాగునీటి నిర్మాణాలకు యునెస్కో అనుబంధ ‘వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్’ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నించారు. కుటుంబం, స్నేహితుల అండతో విద్య పట్ల అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధత, వారసత్వ సంపదపై గౌరవం కలగలిసిన ఆయన ప్రయాణం.. పట్టుదల ఉంటే జీవితంలో ఏ దశలోనైనా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని చాటుతోంది.


