మట్టిలో కలిసిపోనున్న మట్లి రాజస (బు)రుజువులు | - | Sakshi
Sakshi News home page

మట్టిలో కలిసిపోనున్న మట్లి రాజస (బు)రుజువులు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● నాడు శత్రువుల గుండెల్లో నిద్రపోయిన నిఘా వేదికలు.. నేడు అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి నకళ్లు

పెద్దతిప్పసముద్రం: అనంత చారిత్రక వైభవానికి, శత్రుదుర్భేద్యమైన రక్షణ వ్యూహాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రాచీన బురుజులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండల పరిధిలోని మద్దయ్యగారిపల్లి, పోతుపేట, కాట్నగల్లు పంచాయతీలలో నాటి మట్లి రాజుల కాలంలో నిర్మించిన చారిత్రక బురుజులు, కోటగోడలు నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పురాతత్వ శాఖ అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ చారిత్రక చిహ్నాలు కనుమరుగవుతుండటంతో స్థానిక చరిత్ర మరుగున పడిపోతోంది.

నాటి సామ్రాజ్య రక్షణకు ‘నిఘా’ వేదికలు!

పూర్వం రాజులు తమ కీర్తి ప్రతిష్టలకు చిహ్నాలుగా, రాజ్య సంరక్షణ కోసం వ్యూహాత్మకంగా కోటలను నిర్మించేవారు. అందులో భాగంగానే సరిహద్దుల గుండా వచ్చే శత్రువులను, దోపిడీదారులను ముందస్తుగానే గుర్తించేందుకు వీలుగా అత్యంత ఎత్తైన రక్షణ బురుజులను ఏర్పాటు చేసుకునేవారు. యుద్ధ సమయంలో ఈ బురుజులు కీలకమైన పాత్ర పోషించేవి.

సిరిసంపదల గిడ్డంగులు

ఆ రోజుల్లో కేవలం సైనిక అవసరాలకే కాకుండా, స్థానిక సంపన్నులు తమ బంగారం, వెండి, ద్రవ్యం వంటి సిరిసంపదలను అత్యంత సురక్షితమైన ప్రదేశాలుగా భావించి ఈ బురుజులలోనే రహస్యంగా దాచుకునేవారు. దొంగలు గ్రామాల్లోని ఇళ్లపై పడి దోచుకునే సమయంలో ఎక్కడా వస్తువులు దొరకకపోతే, చివరి ప్రయత్నంగా సంపద నిల్వ ఉండే ఈ బురుజులపై దాడి చేసేవారు. అయితే, వీరి రాకను బురుజులపై ఉండే కాపలాదారులు గోడల రంధ్రాల ద్వారా ముందే పసిగట్టేవారు. దొంగలు బురుజుల గోడలు ఎక్కడానికి ప్రయత్నించిన వెంటనే.. కాపలాదారులు ముందే సిద్ధం చేసుకున్న భారీ రాళ్లను వారిపైకి విసిరేవారు, సలసలా కాగే నూనెను పైనుంచి ముంచెత్తేవారు. ఈ ఆకస్మిక దాడులకు దొంగల ముఠాలు పారిపోయేవి.

● తమ పల్లెటూళ్ల పైకి దొంగలు వస్తున్నారని తెలిస్తే, వారిని మానసికంగా దెబ్బతీయడానికి నాటి పెద్దలు ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసేవారు. గ్రామంలో ఉన్న నలుగురు అత్యంత బలవంతులైన మల్లయోధులను ఎంపిక చేసేవారు. వారి భుజాలపై భారీ ఇనుప గానుగ పెనుములు, విపరీతమైన బరువు గల నల్ల గుండ్లను మోపేవారు. అనంతరం, దొంగలు మకాం వేసిన అటవీ లేదా పొలిమేర ప్రాంతాలకు ఈ బలవంతులు వెళ్లి, దోపిడీదారులు చూసే విధంగా ఆ బరువులను ఎత్తుతూ తమ కండబలాన్ని ప్రదర్శించేవారు. వీరిని చూసిన దొంగలు అక్కడి నుంచి వేరే చోటికి తమ మకాం మార్చేవారని చరిత్ర చెబుతోంది.

● దొంగల ముఠాలను అణచివేయడంలో, గ్రామాల శాంతిభద్రతలను కాపాడటంలో శతాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన ఈ బురుజుల ప్రాముఖ్యత కాలక్రమేణా కనుమరుగైపోయింది. ఇప్పటికై నా పురాతత్వ, పర్యాటక శాఖ అధికారులు స్పందించి, వీటిని పునరుద్ధరించి, ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement