కడప కార్పొరేషన్ : కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని రాయలపంతులపల్లెలో పైపులైన్ ఏర్పాటు అంశం వివాదానికి దారి తీసింది. ఊరి మధ్యలో పైపులైన్ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనేక విజ్ఞప్తులు చేసి కష్టపడి నిర్మించుకున్న గ్రామంలో ఉన్న ఏకై క రహదారిని ఈ పైపులైన్ పేరుతో తవ్వాలని చూడడం సరికాదన్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటిని తరలించేందుకు ఈ పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. తమ గ్రామానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఇదేనని, ప్రతిరోజు పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలన్నా, కడపకు పోవాలన్నా ఇదొక్కటే ఆధారమన్నారు. మరోవైపు చాలామంది కూలీ పనులు చేసుకునేవారు తమ రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇల్లు ఈ భారీ పైపులైన్ వల్ల దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఎక్కువ లోతులో పైపులైన్ ఏర్పాటు చేస్తే చాలా ఇళ్లు కూలిపోయే పరిస్థితి వస్తుందన్నారు. కాబట్టి అధికారులు ఈ పైపులైన్ గ్రామం మధ్యలో నుంచి కాకుండా బయటి ప్రాంతం నుంచి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాయలపంతులపల్లెలో
గ్రామస్తుల అభ్యంతరం


