కడప రూరల్ : చిన్నారుల్లో న్యుమోనియాను గుర్తించి, చికిత్స ద్వారా నివారణకు చర్యలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. గురువారం కడప రిమ్స్ చిన్నపిల్లల వైద్య విభాగంలో న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, సకాలంలో గుర్తింపు, సమర్థవంతమైన చికిత్సపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థవంతమైన చికిత్స అందించడమే లక్ష్యంగా శ్రీసాన్స్‌శ్రీకార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శ్రీన్యుమోనియా లేని బాల్యం, ఆరోగ్యకరమైన భవిష్యత్తుశ్రీఅనే నినాదంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అనారోగ్య సమస్యలు కనిపించినప్పుడు తక్షణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత వైద్యమును పొందవచ్చు అన్నారు. అవగాహన కార్యక్రమాలను 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ వంశీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మొహమ్మద్ తాహ తదితరులు పాల్గొన్నారు.


