పోరుమామిళ్ల: బాకీ డబ్బులు చెల్లించలేదనే కారణంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు పాలరైతును కట్టేసి కొట్టిన ఘటన మండలంలోని రౌతుపల్లెలో గురువారం జరిగింది. బాధితుడి కథనం మేరకు వివరాలు..రైతుపల్లెకు చెందిన పాలరైతు రమణయ్య ఉదయం పాలు సేకరించేందుకు సమీపంలోని పెన్నంవారిపల్లెకు వెళ్లాడు. అక్కడ పాలు తీసుకుని ఆటోలో తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన చిల్లా నరసయ్య అతన్ని అడ్డగించి తనకు రావాల్సిన బాకీ డబ్బులు వెంటనే ఇవ్వాలని నిలదీశాడు. డబ్బులు ఇస్తానని రమణయ్య చెబుతుండగానే నరసయ్య తండ్రి కొండయ్య, ఆయన భార్య కట్టెలతో దాడి చేశారు. అనంతరం నరసయ్య, కొండయ్య కలిసి రమణయ్యను అక్కడే కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. మూడేళ్ల క్రితం తాను రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుని అసలు చెల్లించానని, వడ్డీ కింద మరో రూ.1.50 లక్షలకు బాండు రాయించుకుని మూడెకరాల భూమి పత్రాలను తనఖా పెట్టుకున్నారని బాధితుడు వాపోయాడు. అయినప్పటికీ తన మాట వినకుండా దాడి చేసి, గొడ్డలితో చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రమణయ్య తెలిపాడు. కాగా, ఈ విషయమై ఎస్‌ఐని వివరణ కోరగా ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.


