కడప కోటిరెడ్డి సర్కిల్: కడప–కృష్ణాపురం రైలు మార్గమధ్యంలోని పట్టాల వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని, నీలం రంగు బనియన్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదని, ఘటనా స్థలంలో ఓ బాటిల్ లభించిందని వెల్లడించారు. మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామని ఎస్‌ఐ వివరించారు.
రిమ్స్ మార్చురీలో..
కడప అర్బన్: కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లి పరిశీలించారు. సదరు వ్యక్తి పేరు, చిరునామా, ఇతర వివరాలు తెలియరాలేదు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునే నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు 9121100510, 9121100511, 9121100512 నంబర్లకు సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు.
4 తులాల బంగారు చోరీ
కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురం గ్రామంలో షేక్ బీబీ ఇంటిలో 4 తులాల బంగారు నగలను దొంగలు చోరీ చేశారు. వివరాలు.. ఉదయం కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి బీరువా పగలగొట్టి ఉండటాన్ని ఉన్నట్లు గమనించారు. బీరువాలోని 4 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షేక్ బీబీ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
కడప అర్బన్: డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో దూషించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాపేటకు చెందిన మేరీ ఇంటికి పాత కడపకు చెందిన సుజాత, మరికొందరు వెళ్లారు. డబ్బుల బాకీ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుజాత, ఆమెతో వచ్చిన వారు తనను కులం పేరుతో దూషించారని మేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ శ్రీహరి తెలిపారు.


