అధికారం, అరాచకం..
అక్రమాలను చీల్చుకుంటూ ఎదురొడ్డి నిలిచిన ఓటర్లు!
సాక్షి ప్రతినిధి, కడప : ఔను.. దొంగా, పోలీసు ఒక్కటయ్యారు. అబద్ధమూ, అక్షరమూ ఒక్కటయ్యాయి. ఆటగాడూ, అంపైర్ ఒక్కటయ్యారు. పత్రాలు చిత్తుకాగితాలయ్యాయి. సిరా గుర్తు కనురెప్పపాటులో మాయమైంది. భయమూ, ప్రలోభమూ విజయాన్ని శాసించాయి. ఆడబిడ్డల ఆత్మగౌరవం అవమానాలపాలైంది. జనం చుట్టూ సిగ్గులేని వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్లకు కట్టినట్లు తెలిసొచ్చింది. అనుకున్నది సాధించేందుకు ఎంతటికై నా దిగజారుతామని నిరూపించుకుంటున్న పాలకులను, వారికి వత్తాసు పలుకుతున్న చదువుకున్న అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోందని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు. ఎన్నికలను ఏకపక్షంగా ఎలా మార్చుకోవాలో అధికారపక్షం సరికొత్త వికృత చరిత్రను సృష్టించింది. అపార అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ఎన్నికల్లో చేయని తప్పులంటూ లేవు. కనీసం ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనివ్వని ఒక ఘోర నియంత పాలన రాష్ట్రంలో తెరపైకి వచ్చింది. కూటమి మూకలు సాగించిన అరాచకాలకు, దౌర్జన్యాలకు చివరకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోకరిల్లి ‘జీ హుజూర్’ అనక తప్పని పరిస్థితి ఏర్పడింది.
డబ్బు సంచులకు మోకరిల్లిన ఖాకీలు..
ఉన్నత చదువులు ఉత్తుత్తిదేనా?
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత చదువులు చదివి, సమాజంలో పారదర్శకతను కాపాడాల్సిన ఉన్నతాధికారులు నేడు పూర్తిగా సంస్కారహీనంగా మారిపోయారు. కూటమి నేతలు తమ వ్యక్తిగత చాతుర్యంతో, వ్యూహాత్మకంగా ఫిక్స్ చేసి పంపిణీ చేసిన డబ్బు సంచులకు ఉన్నతాధికారులు దాసోహమయ్యారు. అధికారపక్షం విసిరిన ఆ నోట్ల మూటల ప్రభావంతో.. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన డబుల్, త్రిబుల్ స్టార్ అధికారులు కాస్తా కూటమికి పోలింగ్ జనరల్ ఏజెంట్లుగా, క్లస్టర్ ఏజెంట్లుగా అవతారమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) కనురెప్పనే కాటేసిన రీతిలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. తమ కళ్లెదుటే ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకపోయినా, పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కూర్చోనివ్వకుండా రౌడీ మూకలు బయటకు గెంటివేస్తున్నా, సామాన్య ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుంటూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు కనీసం స్పందించలేదు. ’అబ్బే.. మేము చెడు చూడం, చెడు వినం’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కళ్లు, చెవులు మూసుకుని పచ్చ చొక్కాల అడుగులకు మడుగులొత్తడాన్ని చూసి సామాన్య ప్రజానీకం ముక్కున వేలేసుకుంటోంది. ఇంత ఘోరం తెరపైకి వస్తున్నా, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా.. ఏమీ ఎరుగనట్లు ‘అంతా బాగుంది’ అంటూ అరాచక పాలకులకు ‘అయ్యా.. ఎస్!’ అని సెల్యూట్ కొట్టిన ఐఏఎస్, ఐపీఎస్‌లను చూస్తే సిగ్గు వేయకుండా ఉండదని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వాపోతున్నారు.
రక్తపాతానికి తెరలేపిన
‘పొలిటికల్ కిరాయి ముఠాలు’!
‘కిరాయి హంతకులు’.. ఇదివరకు కేవలం నేర సామ్రాజ్యం గురించో విన్న మాట. కానీ నేడు జిల్లాలో ‘పొలిటికల్ కిరాయి ముఠాల’ గురించి వినాల్సి వస్తోంది. కేవలం డబ్బు సంపాదన మాత్రమే పరమావధిగా అవతరించిన ఈ ముఠాలు, స్థానిక సంస్థల ఎన్నికల వేదికగా ఆయా నియోజకవర్గ కూటమి బాధ్యుల వద్ద కోట్ల రూపాయల డబ్బులు వసూళ్లు చేసి రౌడీయిజానికి దిగాయి. కడప, బద్వేల్ నియోజకవర్గాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత అప్రజాస్వామిక, వికృత సంస్కృతిని ఈ కిరాయి ముఠాలు ప్రవేశపెట్టాయి. కడప కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యాన్ని అడ్డుకోవడానికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒప్పందం చేసుకున్న ఒక ప్రత్యేక కిరాయి ముఠా నగరంలో తిష్టవేసి వ్యవహారాన్ని చక్కబెట్టింది. తరతమ భేదం లేకుండా ప్రతిపక్ష ఏజెంట్లు, సామాన్య ఓటర్లపై దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టించింది.
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి సంబంధించి మొత్తం 3,07,093 ఓట్లకు గాను 2,13,323 ఓట్లు పోలవగా.. కార్పొరేటర్ అభ్యర్థుల రేసులో 66 డివిజన్లకు 52 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 14 డివిజన్లలో (డివిజన్లు: 6, 11, 13, 14, 15, 16, 17, 24, 33, 45, 46, 51, 52, 55) జనం ఇచ్చిన తీర్పును మార్చేందుకు కౌంటింగ్ హాల్‌లోనే దౌర్జన్యాలకు తెరలేపారు. 46వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి జమీల్ తరఫున ఏజెంట్‌గా వచ్చిన అతని సోదరుడు అఫ్రోజ్ పై టీడీపీ నాయకులు అధికారుల ముందే భౌతిక దాడికి తెగబడ్డారు. అటు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లోనూ జనం వేసిన ఓట్లను పక్కనబెట్టి, కూటమి నేతలు రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారమే అధికారులు డిక్లరేషన్ ఫారాలు పూర్తి చేశారు.
కలశపాడులో తిరగబడ్డ జనం.. ‘పచ్చ’ గుండాలకు దేహశుద్ధి!
అయితే.. కూటమి అరాచక మూకల దౌర్జన్యాలు అన్ని చోట్లా సాగలేదు. అక్రమాలతో వ్యవస్థలను మేసేస్తున్న పాలకులపై, వారి కిరాయి గుండాలపై సామాన్య ప్రజానీకం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. బద్వేల్ పరిధిలోని కలశపాడులో కమలాపురం నియోజకవర్గం నుంచి అక్రమాలకు పాల్పడటానికి వెళ్లిన పచ్చ కిరాయి ముఠాలపై కలశపాడు ప్రజానీకం వీరోచితంగా ప్రతిఘటించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతున్న చెన్నూరు, కమలాపురానికి చెందిన తెలుగు తమ్ముళ్లను స్థానిక ప్రజలు నడిరోడ్డుపై చితక్కొట్టారు. జనం తిరగబడటంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పచ్చ గుండాలు.. ‘బ్రతుకు జీవుడా’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
వ్యవస్థలను మింగేసిన పచ్చ నియంతృత్వం
మున్సిపల్ పోరులో
‘బాబు’ మార్క్ అరాచకం
డబ్బు సంచులకు దాసోహమై
‘పచ్చ’ ఏజెంట్లుగా మారిన ఖాకీలు
కలెక్టర్, ఎస్పీల లొంగుబాటుపై
ప్రజల ఛీత్కారం
పాలకుల కళ్లు అధికారమదాంధకారంతో మూసుకుపోయినా.. ఆఖరి నిమిషంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కడప నగర ఓటర్లు కొందరైనా ఎదురొడ్డి నిలిచారు. చుట్టూ కూటమి కిరాయి ముఠాలు భయోత్పాతం సృష్టిస్తున్నా, విపత్కర పరిస్థితులు కళ్లెదుటే కనిపిస్తున్నప్పటికీ.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య జనం చేసిన అపూర్వ సాహసమే కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డికి ఏకంగా 66,027 ఓట్లు స్వచ్ఛందంగా లభించేలా చేసింది. అధికార కూటమి పోలింగ్ ఏజెంట్లు ఎవరూ లేకుండా సాయంత్రం వరకు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకున్నా, కౌంటింగ్ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పడిన అసలైన ఓట్లను సైతం కుంటిసాకులతో అభ్యంతరం చెబుతూ వందలాది ఓట్లను ఇన్‌వ్యాలిడ్ (చెల్లనివి) చేసినా.. చివరకు 33, 46 డివిజన్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మద్దిక సంధ్యారాణి, జమీల్‌లను తుది విజయం వరించింది. కడప 33వ వార్డులో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 157 ఓట్ల మెజారిటీలో ఉన్న సంధ్యారాణి ఫలితాన్ని మార్చేందుకు, అధికారులు ఏకంగా గంటన్నర పాటు కౌంటింగ్‌ను నిలిపివేసి హైడ్రామా సృష్టించినా జనం ఇచ్చిన తీర్పు ముందు వారి కుట్రలు సాగలేదు. ఈ రెండు డివిజన్ల తరహాలోనే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు గట్టిగా పోరాటం చేసి ఉంటే, అధికార టీడీపీ కూటమి రాష్ట్రంలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా పరిశీలిస్తే.. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇక్కడ దొంగా–పోలీసు ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విశ్లేషకులు ముక్తకంఠంతో భావిస్తున్నారు. పచ్చ కామెర్ల పాలకులకు ఈ ఎన్నికలు తాత్కాలిక పీఠాన్ని అందించవచ్చు కానీ, కలశపాడులో తిరగబడ్డ జనం, కడపలో ఎదురొడ్డి నిలిచిన ఓటర్ల తీర్పే రాబోయే ప్రజా విప్లవానికి నాంది పలుకుతోంది.


