కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద డిఎఫ్ఎంఓ(డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్)ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని, కేంద్రాలకు సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతి పొందిన అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని, వారు విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. గెలుపొందిన, ఓటమి చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటించాలని, ఎలాంటి ఘర్షణలకు, కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సూచించారు.


