● ప్రభుత్వం సమాధానం చెప్పాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్రనాథరెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తూ అధికార పక్షం సాగిస్తున్న అరాచకాలపై వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూ, వేసిన నామినేషన్లను స్క్రూటినీ పేరుతో అక్రమంగా తిరస్కరిస్తూ, పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి కూడా రానీయకుండా ఎన్నికలు నిర్వహిస్తుంటే... వాటిని స్వేచ్ఛాయుత ఎన్నికలని ఎలా అంటారని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఓటుతో తీర్పు చెప్పాల్సిన ఎన్నికల్లో అసలు పోటీయే లేకుండా చేయడంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాఫియా ముఠాగా మారారు..
ఎస్‌ఈసీ ఏం చేస్తోంది?
ముఖ్యమంత్రి స్థాయి నుంచి రిటర్నింగ్ అధికారుల (ఆర్వో) వరకు అంతా ఒక మాఫియా ముఠాగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని రవీంద్రనాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికలకు రెఫరీగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై ఆయన మండిపడ్డారు. నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులపై దాడులు, బలవంతపు ఉపసంహరణలు, పోలింగ్ ఏజెంట్ల అక్రమ అరెస్టులు, రిగ్గింగ్ ఫిర్యాదులపై ఎస్‌ఈసీ తీసుకున్న చర్యలేంటని నిలదీశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన ఎస్‌ఈసీ పాత్రపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.
పులివెందులలో ఏజెంట్ల అడ్డగింతపై
విచారణ జరపాలి
పులివెందుల నియోజకవర్గంలో 80 బూత్‌లకు గాను ఏకంగా 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఎందుకు అడ్డుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, పోలింగ్ ఏజెంట్లను పోలీస్ స్టేషన్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే వేలాది మంది ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధించారని, అసలు ఏ ప్రాతిపదికన బైండోవర్ నోటీసులు ఇచ్చారో, అరెస్టులు చేశారో సమాధానం చెప్పాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ లేకుండా అడ్డంకులు సృష్టించడంపై ఇచ్చిన ఫిర్యాదుల వివరాలను బహిర్గతం చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ పారదర్శకతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సూపర్ సిక్స్ హామీల లెక్కలేవీ?
2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇంటింటికీ తిరిగి ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీల్లో ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయో ప్రజల ముందు ఉంచాలని రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఇస్తామన్న లబ్ధి ఎంతవరకు అందిందో, దాని పూర్తి లెక్కలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు.


