కడప అగ్రికల్చర్ : ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది పంటల సాగు రైతులకు ఏమాత్రం కలిసి రాలేదు. సకాలంలో వర్షాలు రాక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం రబీ సీజనైనా ఆశాజనకంగా ఉంటుందనుకున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. రబీ ప్రారంభమై 40 రోజులు దాటినా జిల్లాలో కేవలం 5 శాతం మేరకే పంటలు సాగయ్యాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,44,186 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు కేవలం 6,599 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గతేడాది ఈ సమయానికి 18,128 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది మాత్రం సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
నామమాత్రంగానే పంటల సాగు
ఈ రబీ సీజన్‌లో జిల్లాలో పంటల సాగు పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ ఒక్క పంటా కనీసం పావు వంతు కూడా సాగు కాలేదంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన పంటల సాగు వివరాలు ఇలా ఉన్నాయి:
వరి : జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13,393 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు కేవలం 53 హెక్టార్లలోనే (0.4 శాతం) సాగైంది.
మినుము : సాధారణ సాగు 19,210 హెక్టార్లకు గాను ఇప్పటివరకు 3,592 హెక్టార్లలో (18.72 శాతం) పంట వేశారు.
జొన్న : జొన్న సాధారణ సాగు 6,328 హెక్టార్లు కాగా.. 1,105 హెక్టార్లలో (17.46 శాతం) సాగు నమోదైంది.
వేరుశనగ : సాధారణ సాగు 5,373 హెక్టార్లకు గాను కేవలం 356 హెక్టార్లలో (6.3 శాతం) మాత్రమే సాగైంది.
ఉలవ : ఉలవ పంట సాధారణ సాగు 1,632 హెక్టార్లు కాగా.. కొంతలో కొంత నయంగా 420 హెక్టార్లలో (25.7 శాతం) సాగైంది.
కంది : కంది సాధారణ సాగు 457 హెక్టార్లకు గాను కేవలం 20 హెక్టార్లలో (4.3 శాతం) సాగు చేశారు.
మొక్కజొన్న : సాధారణ సాగు 3,276 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు కేవలం 68 హెక్టార్లకే (2 శాతం) పరిమితమైంది.
పత్తి : పత్తి సాధారణ సాగు 2,613 హెక్టార్లు కాగా.. కేవలం 6 హెక్టార్లలో (0.2 శాతం) మాత్రమే సాగైంది.
పడిపోయిన శనగ సాగు
జిల్లా రబీ ప్రధాన పంట అయిన శనగ సాగు ఈ ఏడాది దెబ్బతింది. గతేడాది ఈ పాటికి 7,621 హెక్టార్లలో శనగ సాగు కాగా, ఈసారి కేవలం 971 హెక్టార్లలోనే విత్తారు. ఈ ఏడాది వర్షాలు కురిసి ఉంటే 76,313హెక్టార్లలో సాగయ్యేది. ప్రభుత్వం నుంచి సకాలంలో విత్తనాలు అందకపోవడంతో చాలా మంది రైతులు బయట మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కానీ భూమిలో పదును లేకపోవడంతో విత్తనాలు ఇళ్లలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పటికై నా వరుణుడు కరుణించకపోతే జిల్లాలో భూములన్నీ బీళ్లుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
బోర్ల కింద నామమాత్రం
జిల్లాలో వర్షాధారం కింద 6,088 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా.. బోర్ల కింద కేవలం 511 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదైంది. వర్షాధారం కింద జొన్న 1,105 హెక్టార్లు, శనగ 971 హెక్టార్లు, మినుము 3,592 హెక్టార్లు, ఉలవ 420 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. బోర్ల కింద 53 హెక్టార్లలో వరి, 68 హెక్టార్లలో మొక్కజొన్న, 20 హెక్టార్లలో కంది, 365 హెక్టార్లలో వేరుశనగ సాగయ్యాయి. ఇటీవల ఏర్పడిన మురుసు తుపాన్‌తోనైనా వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా వర్షాలు పడకపోతే పెట్టిన పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల ఊబిలో అన్నదాత
ఇప్పటికే అప్పో సప్పో తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ వాతావరణ పరిస్థితులు గుండెకోత మిగులుస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురవకుంటే పెట్టుబడులు రైతన్నల నెత్తికొచ్చే అవకాశం ఉండటంతో మరింతగా ఆవేదన చెందుతున్నారు. జిల్లా రైతాంగమంతా ఇప్పుడు వరుణ దేవుడి కరుణ కోసం ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తోంది.
రబీ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటినా 5 శాతమే పంటల సాగు
జిల్లాలో కుప్పకూలిన శనగ సాగు
76,313 హెక్టార్లకు..
కేవలం 971 హెక్టార్లకే పరిమితం
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు
విత్తనాలు రెడీగా ఉన్నాయి కానీ..
నేను 10 ఎకరాల శనగ సాగు కోసం 5 వందల కిలోల శనగ విత్తనాలు మార్కెట్ నుంచి తెచ్చుకుని సిద్ధంగా ఉంచాను. కానీ పూర్తిస్థాయిలో వర్షం పడలేదు, భూమి పదును కాలేదు. దీంతో శనగ పంట విత్తలేదు. తెచ్చిన విత్తనాలన్నీ ఇంట్లోనే మూలుగుతున్నాయి. ఎప్పుడు పదును వర్షం కురుస్తుందో, ఎప్పుడు శనగ విత్తుకోవాలో అర్థం కావడం లేదు.
– మూల సుబ్బారెడ్డి, రైతు, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
సగం పొలం బీడుగానే ఉంది..
నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. ఇందులో మూడున్నర ఎకరాల్లో మినుము సాగు చేశాను. మిగతా మూడున్నర ఎకరా భూమి పదును లేక బీడుగానే ఉండిపోయింది. ఇప్పుడైనా మంచి వర్షం కురిస్తే ఆ మిగిలిన భూమిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది, లేకుంటే ఈ ఏడాది అది బీడుగానే మిగిలిపోతుంది. ఈ ఏడాది రైతులకు అస్సలు కలిసి రాలేదు.
– నరసింహారెడ్డి, పిచ్చిపాటిపల్లె, ఖాజీపేట మండలం


