● కరకట్ట నివాసం నుంచి
పక్కా ప్లాన్ చేశారు
● తమపై మూడు పార్టీలు, ఎస్‌ఈసీ, పోలీసులు పోటీ చేశారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి మండిపాటు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కడప కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా బూటకమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘కరకట్ట నివాసం’ నుంచి వచ్చిన ప్లాన్‌ను అఽధికారులు, పోలీసులు పక్కాగా అమలు చేశారని విమర్శించారు. కేంద్రాన్ని, ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఎన్నికలు నిర్వహించారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా తక్కువ శాతం ఓట్లు వేశారని, మిగిలినవన్నీ రిగ్గింగ్, సైక్లింగ్ ద్వారా వేసుకున్నవేనని తూర్పారబట్టారు. వైఎస్సార్‌సీపీపై టీడీపీ, జనసేన, బీజేపీ, ఎస్‌ఈసీ, పోలీసులు కలిసి పోటీ చేశారని ఎద్దేవా చేశారు. తిమ్మిని బమ్మిని చేసి అర్థరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించారన్నారు. ఐదు అంచెల దౌర్జన్యాలను, అడ్డంకులను అధిగమించి ప్రజలు తమ మేయర్ అభ్యర్థి బండి దీప్తికి 67వేల మంది ఓట్లు వేశారన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఏజెంటు కూడా లేకుండా ఎన్నికలు జరిపినా టీడీపీ కేవలం 65వేల మెజార్టీ సాధించిందన్నారు. ఇన్‌వ్యాలిడ్ ఓట్లన్నీ టీడీపీ ఓట్లలో కలిపేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ అఫ్రోజ్‌పై కౌంటింగ్ కేంద్రంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఇది విజయం కాదని వాళ్ల మనస్సాక్షికి కూడా తెలుసని, అందుకనే వారి మొఖాల్లో సంతోషం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీకి అభ్యర్థులు, ఏజెంట్లు లేరని టీడీపీ జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాసులరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కడప నగరంలో తమ పార్టీ పదవులు ఉన్నవారే 12వేలమంది ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 22లక్షల మంది ఉన్నారన్నారు. వారి కుటుంబాలు, సాధారణ కార్యకర్తలు, అభిమానులను కలిపితే ఎంతమంది అవుతారో లెక్కపెట్టుకోవాలన్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరక్క చక్రాయపేట, పెండ్లిమర్రి ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
ఈ విజయం ఎస్‌ఈసీ, కలెక్టర్, డీఐజీ, ఎస్పీలదే: రఘురామిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో ఎస్‌ఈసీ, కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు విజయం సాధించారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పొంగి పొర్లుతోందని, అందుకే 99 శాతం ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చాయని ఎగతాళి చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు, 18ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 బ్రహ్మాండంగా అమలు చేశారని, నెలకు మూడు సిలిండర్లు ఇస్తామని, ఇప్పటికీ పది సిలిండర్లు ఇచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని, 2029లో దిమ్మతిరిగేలా ఫలితాలు వస్తాయని హెచ్చరించారు.
వారితో పోరాటం చేయలేక
విఫలమయ్యాం: అంజద్‌బాషా
స్టేట్ ఎన్నికల కమిషన్, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పోరాటం చేయడంలో తాము విఫలమయ్యామని, తాము ఈ ఎన్నికల్లో పోటీ చేసింది వారితోనేనని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో 361 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్ లేకుండా చేశారని, ఒక్కో బూత్‌లో 300 నుంచి 350 ఓట్లు వేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. టీడీపీ అభ్యర్థికి వచ్చిన 1.31లక్షల ఓట్లలో 1.20లక్షల ఓట్లు రిగ్గింగ్ చేసినవేనని ఆరోపించారు. ఒక్క ఏజెంట్ లేకపోయినా సుమారు 67వేల ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దీప్తి నైతికంగా విజయం సాధించారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, ఎస్. వెంకటేశ్వర్లు, దాసరి శివప్రసాద్, ఫయాజ్ పాల్గొన్నారు.


