ప్రొద్దుటూరు : కూటమి నాయకులు ఎన్నికల్లో సాధించింది విజయం కాదు.. ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన పీడ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 2029లో మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాతే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునరుజ్జీవం వస్తుందన్నారు. ఆయన బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రధానంగా పంచశక్తులు పంచతంత్ర ప్రయోగం ద్వారా విజయం సాధించాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసులతోపాటు కలెక్టర్లు కలసి అన్యాయం చేశారన్నారు. ఇందులో భాగంగానే తొలిగా ప్రతిపక్ష పార్టీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఒక వేళ ఎవరైనా వేయడానికి వెళితే చించేయడం జరిగిందన్నారు. వేసిన నామినేషన్లను స్క్రూటినీలో తొలగించారని తెలిపారు. అది కూడా దాటి వచ్చిన వారికి ఎన్నికల పోలింగ్ రోజున బయటికి రాకుండా, ఏజెంట్లను కూర్చోకుండా అడ్డుకోవడం, తమపై బైండోవర్ కేసులు పెట్టించడం, దొంగ ఓట్లు వేయించడం జరిగిందన్నారు. చివరగా కౌంటింగ్ రోజున సైతం దాడులు చేసిన చరిత్ర ఇప్పుడే జరిగిందని రాచమల్లు స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన పీడలాంటిదని తెలిపారు. అప్రజాస్వామిక విధానంతో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇప్పుడు విజయం సాధించామని సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటే నవ్విపోతారన్నారు. అధికార పార్టీ నేతలే కాదు కలెక్టర్లు, పోలీసులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని చంపినందుకు మిఠాయిలు పంచితే బాగుంటుందన్నారు. గాలికి ఎన్నికై న వారు గాలిలోనే పోతారని, వీరు పూర్తి పదవీకాలంలో ఉండే అవకాశం లేదన్నారు. 2029 జూన్ వరకే వీరి కాలపరిమితి ఉంటుందన్నారు. ఈ రెండున్నరేళ్లలో అయినా వీరు ప్రజలు సేవ చేయాలని తెలిపారు.
లేఖపై వరద ఫోర్జరీ కేసు నమోదు చేయాలి
మున్సిపల్ చైర్మన్ స్థానానికి తన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డికి ఇచ్చేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జనరల్ కేటగిరికి కేటాయించాలని లేఖ రాసిన విషయాన్ని రాచమల్లు శివప్రసాదరెడ్డి గుర్తు చేశారు. తాను చూపిన లేఖ అబద్దమైతే ఎమ్మెల్యే వరద ఫోర్జరీ కేసు పెట్టాలని కోరారు. లేదా తన మనవళ్లు, మనవరాళ్లపై ప్రమాణం చేయాలని తెలిపారు. స్వయంగా రాసిన లేఖ తనది కాదని ఎమ్మెల్యే పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే లేఖను తానే రాసి ఫోర్జరీ సంతకం చేసి ఆరోపణలు చేస్తున్నట్లు అయితే తనపై 465, 471 సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చునని చెప్పారు. మున్సిపల్ ఆఫీసుతోపాటు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు కూడా ఎమ్మెల్యే ఇచ్చిన లేఖను చూశామన్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎంపీపీ శేఖర్‌యాదవ్, రాజుపాళెం మాజీ ఎంపీపీ మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పిట్టా బాలాజీ, యాలం శంకర్, బండారు సూర్యనారాయణ, బీఎన్‌ఆర్ పాల్గొన్నారు.
సంబరాలు చేసుకోవడానికి అర్హత లేదు
లేఖపై ఎమ్మెల్యే వరద ఫోర్జరీ కేసు పెట్టాలి
మాజీ ఎమ్మెల్యే
రాచమల్లు శివప్రసాదరెడ్డి


