ప్రొద్దుటూరు : గత టీడీపీ హయాంలో బీసీలను ఎదగనిచ్చారా, కనీసం ఒక్క మున్సిపల్ చైర్మన్‌నైనా పూర్తికాలం పదవిలో ఉండనిచ్చారా అని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డిని ప్రశ్నించారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త భీమునిపల్లి నాగరాజు మాట్లాడుతూ.. రాచమల్లు శివప్రసాదరెడ్డి సహకారంతోనే సాధారణ టైలర్ కుటుంబానికి చెందిన తమకు చైర్మన్ పదవి దక్కిందన్నారు. తాము ఐదేళ్లు పూర్తికాలం పదవిలో ఉండి రూ.150 కోట్ల రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశామని, గతంలో సేట్ గురివిరెడ్డి, వద్ది సురేఖ వంటి బీసీ నేతలను టీడీపీ పూర్తికాలం పదవుల్లో ఉండనివ్వలేదని విమర్శించారు. మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా బీసీ, నా ఎస్సీ అంటూ అణగారిన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేశారని కొనియాడారు. తొగటవీరక్షత్రియ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాసిన లేఖ ప్రొద్దుటూరులో చుట్టూ తిరుగుతోందన్నారు. తమ నాయకుడు రాచమల్లు శివప్రసాదరెడ్డితోపాటు తాము ప్రమాణం చేస్తామని టీడీపీ బీసీ నేతలు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వరద రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని మాజీ కౌన్సిలర్ పిట్టా బాలాజీ డిమాండ్ చేశారు. ఆ లేఖ నిజమని తేలితే టీడీపీలోని బీసీలు రాజీనామా చేయాలని, అబద్ధమైతే తాము వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. 36 మంది నామినేషన్లు చెల్లకుండా చేసి ఇప్పుడు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు యాలం శంకరయ్య యాదవ్ మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు పిట్టా భద్రమ్మ, వుట్టి రమణమ్మ, పల్లా లక్ష్మీదేవి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వరద లేఖపై వైఎస్సార్‌సీపీ
బీసీ నేతల ఘాటు విమర్శలు


