గ్రామ కంఠంపై అధికార పార్టీ నేత కన్ను! | - | Sakshi
Sakshi News home page

గ్రామ కంఠంపై అధికార పార్టీ నేత కన్ను!

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

● ఇల్లూరులో ఉమ్మడి స్థలం ఆక్రమణకు యత్నం

● అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ యంత్రాంగం

● సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో బుధవారం సాయంత్రం హైడ్రామా చోటుచేసుకుంది. గ్రామంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రామ కంఠం భూమిని, పీర్ల చావడి గుండం స్థలాన్ని అక్రమంగా చేజిక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి చేస్తున్న ప్రయత్నాలకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కొలతలు వేసేందుకు వచ్చిన సర్వేయర్లను గ్రామస్తులు ఉమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇల్లూరు గ్రామం మొత్తం గ్రామ కంఠం పరిధిలోనే ఉంది. ఇక్కడ చారిత్రక బురుజుతో పాటు పీర్ల చావడికి సంబంధించిన గుండం స్థలం ఉంది. అయితే, ఇప్పటికే బురుజు చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి స్థలాన్ని సదరు అధికార పార్టీ నేత ఆక్రమించి ఏకంగా సీసీ రోడ్డు కూడా వేసుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా పీర్ల చావడి గుండం స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి పొజిషన్‌ సర్టిఫికేట్‌ కోసం రెవెన్యూ అధికారులతో చేతులు కలిపాడు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా, కనీసం గ్రామంలో ఉమ్మడి సమావేశం కూడా పెట్టకుండా ఏకపక్షంగా సదరు వ్యక్తికి పొజిషన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ఎలా వస్తారని గ్రామస్తులు మండిపడ్డారు. అధికారుల తీరు వల్ల గ్రామంలో ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.

కొలతలు వేయకుండానే

వెనుతిరిగిన అధికారులు

సదరు వివాదాస్పద స్థలంలో కొలతలు వేయడానికి వచ్చిన మండల సర్వేయర్‌ లక్ష్మీప్రసన్న, విలేజ్‌ సర్వేయర్‌ రాజారాంలను గ్రామస్తులు ముట్టడించి గట్టిగా నిలదీశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు కొలతలు వేయకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామస్తులతో చర్చించి ఉమ్మడి భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎర్రగుంట్ల తహసీల్దార్‌ అమరేశ్వరిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పొజిషన్‌ సర్టిఫికేట్‌ కోసం ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకున్నారు. ఆ అర్జీ నిమిత్తం ప్రాథమిక పరిశీలన కోసమే సర్వేయర్లను పంపించామని, అంతకుమించి మరేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement