దీపావళి సందడి షురూ! | - | Sakshi
Sakshi News home page

దీపావళి సందడి షురూ!

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

ఇబ్బందులు లేకుండా చూడాలి

● ఏర్పాటవుతున్న టపాసుల దుకాణాలు

● కడప నగరంలో రెండు వేదికలు

● దాదాపు 100కు పైగా దుకాణాలు

కడప సిటీ : కడప నగరంలో దీపావళి పండుగ సందడి షురూ అయింది. ఈ నెల 8న పండుగ నేపథ్యంలో టపాసుల వ్యాపారులు దుకాణాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.. ఎప్పటిలాగా స్థానిక మున్సిపల్‌ మైదానంతోపాటు బిల్టప్‌ వద్ద దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికి దాదాపు 100 మందికి పైగా వ్యాపారులు దుకాణాల ఏర్పా టు కోసం రుసుము చెల్లించారని, మరింతమంది రుసుము చెల్లించే అవకాశం ఉందని సమాచారం. అధికారులు తమకు అందిన దరఖాస్తులను వడపోసి డిప్‌ తీసి దుకాణా లను కేటాయించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఇచ్చే రశీదును వ్యాపారులు హోల్‌సేలర్స్‌కు చూపించి స్టాకు తెచ్చుకుంటారు. ఈ క్రమంలో డిప్‌ ద్వారా దుకాణదారులకు నెంబర్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి మున్సిపల్‌ మైదానంలో 65 దుకాణాలను, బిల్టప్‌ వద్ద 35 దుకాణాల ఏర్పాటుకు తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. ఈ పనులు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదేరోజున టపాసులను దుకాణాలకు చేర్చి దుకాణాలను ప్రారంభించనున్నారు. అధికారుల సూచన మేరకు ప్రతి దుకాణం మధ్యన 8–10 అడుగుల దూరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఈసారి మున్సిపల్‌ హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాంతం విశాలంగా కనిపిస్తోంది. స్టేడియం గోడ వైపు ఉండిన రోడ్డును రాజేశ్వరిగుడి వద్ద మూసివేశారు. దీంతో రోడ్డును కూడా కలుపుకుని దుకాణాలు వేయడంతో మధ్యనున్న ప్రాంతం విశాలంగా మారింది.

దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసుల స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు సిద్దమవుతున్నారు. భద్రతాపరంగా అధికారుల సూచనలు పాటిస్తున్నాం. స్టాల్‌ ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో అధికారులు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా వ్యాపారులకు అధికార యంత్రాంగం తోడ్పాటు అందించాలి.

– బాబు, టపాసుల దుకాణదారుడు, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement