పెండ్లిమర్రి : మండల పరిధిలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతల శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది.ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర స్వామి, పార్వతీ దేవి, అక్కదేవతలు, పులి బండన్న స్వామి వార్ల శాశ్వత హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ. 15,65,909 నగదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు 1,800 గ్రాముల వెండి, 24 గ్రాముల బంగారం వచ్చిందన్నారు.
ఫోర్జరీ కేసులో రిమాండ్
మదనపల్లె టౌన్ : ఫోర్జరీ కేసులో ముగ్గురికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు మదనపల్లె రెండో పట్టణ సీఐ గోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. సీఐ మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన లేడీ డాన్ కోనేటి సులోచన, కడియాల శ్రీరాములు నాయుడు, గండి మోహన్‌లను ఇటీవల ఫార్జరీ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన మార్పురి శ్రీరామ్ భూమిని ఫోర్జరీ దస్త్రాలతో తన పెదనాన్న కృష్ణమూర్తి కుమారుడు మార్పురి వెంకటేష్ భూమిని రాసిచ్చినట్లు కోట్ల విలువైన శ్రీరామ్ భూమిని స్థానిక టమాటా మార్కెట్ యార్డు వద్ద 2003లో కబ్జా చేసిందన్నారు. ఈ కేసులో బాదితుడి ఫిర్యాదుపై వారం క్రితం కోనేటి సులోచనతో పాటు స్థానిక రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉండే కడియాల శ్రీరాములు నాయుడు సహా మరో 12 మంది పై ఫార్జరీ కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఇదివరకే వన్‌టౌన్ పోలీసులు ఫార్జరీ కేసులో సులోచనతో పాటు శ్రీరాములు నాయుడును అరెస్టు చేయడంతో సబ్ జైల్లో ఉన్నట్లు తెలిపారు. మార్పురీ శ్రీరామ్ ఫిర్యాదుతో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై కస్టడీకి తీసుకుని కోనేటి సులోచన, గిండి మోహన్, కడియాల శ్రీరాములు నాయుడును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్: యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని బెంగళూరు ప్రధాన రహదారిలోని చిప్పిలి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రాగిమాకుల పల్లెకు చెందిన మనోహర్ బైక్‌పై ఇంటికి వెళ్తూ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్‌న్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని మదనపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.


