వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

ఖాజీపేట/చెన్నూరు (వల్లూరు) : వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. అయ్యప్ప స్వామి దర్శనం ముగించుకుని బైక్‌పై వస్తున్న ఓ యువకుడు, అలాగే తిరుమల కాలినడక యాత్రకు బయలుదేరిన మరో భక్తుడు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ముందరి వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌

ఖాజీపేట : కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నూరులోని గాంధీనగర్‌కు చెందిన ఆమూరి రోహిత్‌ (21), అతని స్నేహితుడు భరత్‌ కలిసి ఖాజీపేట మండలం పుల్లూరు పంచాయతీ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం ముగించుకుని ఇద్దరూ కలిసి బైక్‌పై తిరిగి చెన్నూరుకు బయలుదేరారు. వీరి బైక్‌ కొండపేట క్రాస్‌ వద్దకు చేరుకోగానే ముందర వెళ్తున్న ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోహిత్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే ఖాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన భరత్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

చెన్నూరు (వల్లూరు) : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న అయ్యప్ప భక్తుల బృందంలో విషాదం నెలకొంది. పెన్నానది బ్రిడ్జిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు బ్రిడ్జిపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన 44 మంది అయ్యప్ప స్వాముల బృందం తిరుపతి యాత్రకు బయలుదేరింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వారు వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులోని కడప–కర్నూల్‌ హైవే బ్రిడ్జి సమీపంలోని ఆంజనేయ స్వామి కొట్టాల వద్ద బస చేశారు. బుధవారం ఉదయం ఈ బృందం కడప మీదుగా తిరుపతికి కాలినడకన ప్రయాణమైంది. అయితే, ఈ బృందంలోని సంతోష్‌ (26) అనే భక్తుడు మిగతా వారికంటే ముందుగా ఒంటరిగా బయలుదేరాడు. మిగిలిన భక్తులు వెనుక నుంచి వస్తుండగా, ముందు వెళ్తున్న సంతోష్‌ను పెన్నానది బ్రిడ్జిపై ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సంతోష్‌ బ్రిడ్జిపై నుండి కింద పడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా భక్తులు కడపకు చేరుకున్నాక సంతోష్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనుమానం వచ్చి తిరిగి వెనక్కి వచ్చి వెతకగా, కడప–కర్నూలు హైవేలోని పెన్నా నది బ్రిడ్జి కింద సంతోష్‌ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement