ప్రజాదరణ లేకనే టీడీపీ దుర్మార్గాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజాదరణ లేకనే టీడీపీ దుర్మార్గాలు

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

కడప సిటీ : కూటమి ప్రభుత్వం ప్రజాదరణ లేకనే, ఓటమి భయంతో దుర్మార్గాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో స్టేట్‌ వర్కింగ్‌ ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, ప్రచార కమిటీ జోనల్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌, క్రిస్టియన్‌ మైనార్టీ ప్రధాన కార్యదర్శి జాన్‌, జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి, జిల్లా జాయింట్‌ సెక్రటరీ మునీంద్రారెడ్డి, వైద్య విభాగం జిల్లా కార్యదర్శి డాక్టర్‌ పెంచలయ్యతో కలిసి ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాలపై ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు కావస్తున్నా ఎవరికీ మేలు చేసింది లేదన్నారు. అబద్ధాల మ్యానిఫెస్టో సృష్టించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. అర్నబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 9 మంది మృతి చెందడమే కాకుండా తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయి ఉంటే.. అవేమి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి పెట్టడం విచారకరమన్నారు. టీడీపీ వాళ్లే ఓటరు స్లిప్పులు ఇచ్చి ఓట్లు వేయించుకునే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఆదివారం జరిగే పోలింగ్‌ రోజున ఓటర్లను భయపెట్టేందుకు కూటమి నాయకులు ఇప్పటికే పన్నాగం పన్నారని తెలిపారు. ఓటర్లు తెల్లవారకముందే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటే వారు చేసే అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చని విజ్ఞప్తి చేశారు.

వీడియోలు తీసి వాట్సాప్‌లో పంపండి

పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ చేసే అరాచకాలు, దుర్మార్గాలను వీడియోలు తీసి వాట్సాప్‌ నంబర్‌ 87126 03263కు పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గానీ, ఎన్నికల కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌కు పంపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం లోకల్‌, నాన్‌ లోకల్‌ పోరాటం జరుగుతోందన్నారు. ఇప్పటికే పులివెందులకు జమ్మలమడుగు, కదిరి, ప్రొద్దుటూరు, కమలాపురం నుంచి బయటి వ్యక్తులను తరలించారన్నారు. కడపకు కూడా బయటి వ్యక్తులను తరలించేందుకు పన్నాగం పన్నారన్నారు. న్యాయానికి, అన్యాయానికి స్థానిక సంస్థల ఎన్నికలు పోరాటంగా సాగుతున్నాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి దుర్మార్గాలు, అరాచకాలు ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలు కళ్లారా చూస్తున్నారన్నారు. ఓటర్లు ఏమాత్రం భయపడకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

న్యాయానికి, అన్యాయానికి

మధ్య పోరాటం

లోకల్‌, నాన్‌ లోకల్‌కు ఎన్నికలు

తెల్లవారకముందే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకోవాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement