● అహంభావంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరద
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఐదు వ్యవస్థలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక రామేశ్వరంలోని హనుమత్ లింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశ్వరుని సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్నికల కమిషన్, పోలీసులు, కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని 2,47,000 మంది ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. మొత్తం అన్ని స్థానాలను.. అత్యంత దుర్మార్గానికి పాల్పడి ప్రజలకు ఓటు వేసే అవకాశం కల్పించకుండా ఏకగ్రీవం చేసుకున్నారని చెప్పారు. 52 వార్డులతోపాటు చైర్మన్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. 13 రోజుల తర్వాత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి బయటికి వచ్చి పత్తిగింజలా మాట్లాడుతున్నారన్నారు. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుని పత్రాలను చించేయడం, నామినేషన్లు వేసిన వారిని స్క్రూటినీకి లోనికి వెళ్లకుండా దౌర్జన్యం చేశారన్నారు. అత్యంత దారుణంగా రౌడీయిజానికి పాల్పడి ఇప్పుడు వరద అధికారం ఉందని అహంభావ పూరితంగా మాట్లాడుతున్నారన్నారు. ఇందుకు ప్రధాన కారణం అక్రమ సంపాదనే అని తెలిపారు. ఆయన కుమారుడు కొండారెడ్డి ఇసుక అక్రమ రవాణా ద్వారా రోజూ రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, మిగతా వాటిలో రూ.కోట్లు ఆర్జిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగానే మీ ఓటు మాకు అవసరం లేదని, అన్నీ వారే ఏకగ్రీవం చేసుకుని ఓటర్లను మానసికంగా చంపేశారన్నారు. ప్రజాస్వామ్యానికి పంచప్రాణాలు ప్రధానమని, అవే ప్రజాస్వామ్య వ్యవస్థను మానభంగం చేశాయన్నారు.


