వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో 311 మంది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ మద్యాల లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అనంతరం అక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లు, భోజనశాలలు, ఆగిపోయిన ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి సుమారు రూ.200 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయన్నారు. ట్రిపుల్ ఐటీల భవన నిర్మాణాలు, అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి నిధులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.40 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం చేపట్టగా.. కేవలం రూ.9 కోట్ల వరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.30 కోట్ల వరకు నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి క్యాంపస్ భవన నిర్మాణాలకు రూ.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఫ్యాకల్టీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి రత్నకుమారి, పీఆర్‌ఓ బాషా, అధ్యాపకులు పాల్గొన్నారు.


