పులివెందుల : అభివృద్ధి, రైతుల సంక్షేమం విషయంలో వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన కృషి ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన పులివెందుల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించింది వైఎస్ కుటుంబమేనన్నారు. వైఎస్ జగన్ రూ.500 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీకి మంజూరైన 50ఎంబీబీఎస్ సీట్లను కూటమి ప్రభుత్వం వద్దని సీమ విద్యార్థులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. సుమారు 8 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, బోర్‌వెల్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాం. కానీ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ కాలనీల్లో ఒక్క రూపాయి పని కూడా చేయలేదని తూర్పారబట్టారు. రైతుల కోసం రూ.25 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌ను కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. వీటన్నింటినీ స్థానిక ప్రజలు గుర్తించాలలని పేర్కొన్నారు. పులివెందుల మున్సిపాలిటీని దొంగల చేతుల్లో పెట్టకుండా, వైఎస్సార్సీపీ చైర్‌పర్సనన్ అభ్యర్థి ప్రమీలమ్మతోపాటు, పార్టీ పోటీ చేస్తున్న 20వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


