సాక్షి ప్రతినిధి, కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతల విజయం కోసం కొందరు ఖాకీలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ‘పీఠాన్ని’ పచ్చచొక్కాలకు అప్పగించేందుకు అడుగడుగునా శ్రమిస్తున్నారు. వారం రోజులుగా నామినేషన్ల పర్వంలో పచ్చ నేతలకు కట్టుబానిసగా పని చేసిన పోలీసులు.. తాజాగా ఉపసంహరణలోనూ అదే నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు పచ్చమూకలు బీఎన్‌ఎస్ యాక్ట్ 163ను ధిక్కరించినా కళ్లప్పగించి చూస్తుండిపోయిన ఖాకీలు.. విపక్షపార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పక్కా ప్రణాళిక బద్ధంగా వ్యవహారించారు. తొలి అడుగు సక్సెస్‌గా వేసిన పోలీసులు మలి అడుగుపై దృష్టి పెట్టారు. నామినేషన్ పరిశీలనలో నిలిచిన అభ్యర్థుల ఉపసంహరణకు సామ, దాన బేధ దండోపాయాలను పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. అభ్యర్థి కాకపోతే, ప్రతిపాదకుడిని లోబర్చుకొని ఉపసంహరణ చేయించాలనే ఎత్తుగడలు వేగంగా అమలు పరుస్తున్నారు. ఫలితంగా పోటీలో కొనసాగడానికి అభ్యర్థులు ‘రణమే’ చేస్తున్నారు.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం నామినేషన్ వేయడానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు యుద్ధమే చేశారు. వందలాది మంది పచ్చగూండాలు చుట్టుముట్టి నామినేషన్ పత్రాలను చించేస్తున్నా భరించారు. ప్రత్యక్ష దాడులు చేసినా సహించారు. వీటిని తట్టుకొని నామినేషన్ కేంద్రానికి చేరుకుంటే, కొంతమంది పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఇదే అదునుగా ఖాకీల సమక్షంలోనే పచ్చ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ దుష్ట సంస్కృతిని నిలువరించాల్సిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం వత్తాసుగా నిలిచారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇక ఇవన్నీ దాటుకొని నామినేషన్ కేంద్రానికి చేరుకుంటే నామినేషన్ స్వీకరించకుండా రిటర్నింగ్ విభాగం అడ్డుకుంది. పేపర్లు సక్రమంగా లేవు, మళ్లి తీసుకురాండంటూ వెనుదిరిగి పంపించడం, బయటికి రాగానే పొంచుకొని ఉన్న టీడీపీ శ్రేణులు దాడులు చేయడం ఇలా మూడు రోజులు కాలచక్రం తిరిగిపోయింది. ఇక నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో ఇక అభ్యర్థుల ఉపసంహరణపై ప్రత్యేక దృష్టి సారించారు.
పరిశీలనలోనూ శల్య సారధ్యం...
జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలనలో కూడా అధికారులు శల్యసారధ్యం వహించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు పత్రాలను టీడీపీ అభ్యంతరం పెట్టేంత వరకూ రిటర్నింగ్ అధికారి పేపర్లు అటు ఇటు తిప్పుతూ కావాలనే కాలయాపన చేస్తున్నారనే పలువురు చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి పొద్దుపోయే సమయానికి సగం నామినేషన్లు కూడా పూర్తి కాలేదు. అందులో వైఎస్సార్‌సీపీకి చెందిన పెండ్లిమర్రి, వల్లూరు, బి.మఠం, ప్రొద్దుటూరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. కొండాపురం, వీరబల్లి,సుండుపల్లి,చక్రాయపేట,జమ్మలమడుగు,పోరుమామిళ్ల,వేంపల్లె, మైలవరం, తొండూరు, పెద్దముడియం అభయాన్స్(ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ) లో పెట్టారు. ఇప్పటికే ముద్దనూరు, ఖాజీపేట, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయించలేదు. ఆరు జెడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా, నాలుగు స్థానాల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఇలా యంత్రాంగం ఎక్కడిక్కడ వారి వారి శక్తిమేరకు అధికారపక్షానికి ఉప యోగపడుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యవిలువలకు తిలోదాకాలిస్తూ ఏకపక్ష నిర్ణయాలకే మొగ్గు చూపుతుండడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుశాఖ ప్రతిష్ట దిగజారిపోయింది. ఖద్దరు నేతల మెప్పు కోసం కొంతమంది దిగజారి ప్రవర్తిస్తున్నారు. నామినేషన్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులను సైతం నిలువరించారు. అర్ధరాత్రుల వేళ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని అక్రమ నిర్బంధంలో పెట్టారు. జిల్లా చరిత్రలోనే పోలీసుశాఖ మాయని అపప్రదను మూటగట్టుకుంది. తాజాగా ఉపసంహరణ కోసం కట్టుబానిసగా మారి పని చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రతిపాదకులపై దృష్టి సారించారు. బెదిరింపులకు దిగుతున్నారు. నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలంటూ ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఈవ్యవహారంలో జిల్లా కేంద్రంలో ఉన్న డబుల్, త్రిబుల్ స్టార్ అధికారులు మరింత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. వ్యవస్థలు ఏకపక్ష చర్యలు కారణంగా ఇప్పటికే ఆరు మండలాలకు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. మరో 6మండలాలకు చెందిన జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించారు. మిగిలిన అభ్యర్థులపై ఖాకీ వనంలో ఉన్న కలుపు మొక్కలు తీవ్రస్థాయి ఒత్తిళ్లు పెంచుతున్నారని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిణామాన్ని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజాస్వామ్యవాదులు వివరిస్తున్నారు.


