(కడప డెస్క్)
మా ఊరికి పండుగొచ్చింది... అవును, ఓటు వేయడమంటే నాకెప్పుడూ పండగే. నాకే కాదు, మా ఊరోళ్లందరికీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అంటే ఒక పెద్ద వేడుక. ఐదేళ్లంతా మమ్మల్ని పట్టించుకోని లోకం, ఈ ఓటు పండగప్పుడే నన్ను గౌరవంగా పిలుస్తుంది. నా ఇంటి గడప తొక్కుతుంది. నా ఇంటి నవారు మంచంపై కూర్చుని నా కుశల సమాచారం అడుగుతుంది.
నేనా అల్పసంతోషిని. ఆ వచ్చే నాయకుడు నా భుజంపై చేయి వేయగానే బో మురిసిపోతా. ఐదేళ్లపాటు పోలీసోళ్లతో, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఆఫీసర్లతో సెల్యూట్లు కొట్టించుకునే పెద్ద లీడర్... నా ఇంటి కాడికి వచ్చి నాతో కబుర్లాడితే సంతోషం ఉండదా ఏంది? ఓటేశాక నా వేలిపై పడిన సిరాచుక్క ఉన్నంత కాలం ఆ సంతోషం మనసులోనే ఉంటుంది. ఐదేళ్లలో కనీసం ఓ రెండు సార్లైనా నాబోటి పేదవాళ్లకు ఈ గౌరవం దక్కిందంటే, అది నాకు ఓటు హక్కు కల్పించిన నా దేశానిదే... రాజ్యాంగం రాసిన ఆ మహానుభావులదే!. ఇక ఓటు ఎవరికి వేస్తానంటా రా... ఎవరికి వేయాలో నా మన ‘సాక్షి’ చెబుతుంది.
కానీ, ఇప్పుడే నాకు దిగులు పట్టుకుంది...
‘దేశం’లో దొంగలు పడ్డారని, ఓట్ల చోరీ జరిగిందని అందరూ చెబుతుంటే మనసంతా ఒక మాదిరిగా అయిపోతోంది. నిజంగానే నా ఓటును దొంగిలిస్తే, ఇక ఈ ఎన్నికకు విలువేముంటుంది? నాలాంటోడికి రేపు గౌరవం ఎవరిస్తారు? ఓట్ల చోరీ జరిగిందని చదువుకునే పిల్లోళ్లందరూ ఢిల్లీ దాకా పోయి, ధర్నాలు చేస్తూ దెబ్బలు తింటుంటే మనసంతా చీకట్లు కమ్మింది. మా ఊరోడినే అడిగితే ‘నిజమే ఉంటాది లేబ్బా’ అంటున్నాడు. ‘అంతెందుకు... మొన్న పులివెందులలో జరిగిన బై ఎలచ్చన్కి మా ఊరి నుంచి నారాయణ మామ పోయి ఓటేసిన్ల్యా’ అన్నాడు. ‘మా ఊరి నారాయణకి మా ఊర్లోనే ఓటుంటుంది గానీ, అక్కడెక్కడో ఎందుకుంటుందిరా’ అని నేనడిగితే... వాడు సెల్‌ఫోన్ తీసి ఫొటో చూపించాడు. అది చూసేసరికి ఒక్కసారిగా పిచ్చెక్కిపోయిందబ్బా! అయినా... ఇట్టా దొంగ ఓట్లు వేస్తాంటే చదువుకున్న పెద్దసార్లు ఏం చేస్తా ఉండారో.. ఈ వారంలో నామినేషన్ల తీరు చూసి విస్తుపోవడం నా వంతైంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసోళ్లు ఎవరికి కాపలా కాస్తుండారో.. ఇలా చేయడం తప్పు కదా సారూ!
ఎన్నికలు నడిపించే కలెక్టర్ సార్‌కి...
పోలీస్ బాస్‌కి నాదొక చిన్న మాట...
మీరు ఇంత పెద్ద చదువులు చదివి ఆ కుర్చీల్లో కూర్చు న్నారంటే రాత్రి పగలు ఎంత కష్టపడి ఉంటారు సా రూ? ఆ రోజు కష్టపడిన మీకు కాకుండా, దొంగదారి లో వచ్చిన వాళ్లకు ఆ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీకు ఎంత బాధ వేసి ఉండేది? ఒక్కసారి తలచుకోండి సారూ. పెభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయి... నాయకులు కూడా అంతే, వస్తారు పోతారు. కానీ మీరు ఎవరికీ తొత్తులుగా ఉండొద్దు సారూ. చట్టాన్ని నమ్ముకున్న మీరు నా పక్షాన నిలబడాలి. నా ఓటును కాపాడాలి. నాకు భద్రత, భరోసా ఇవ్వాలి. ఇస్తారు కదా సారూ?. ఏమో ఈ వారంలో రోజుల నుంచి జరిగిన తీరు చూస్తాంటే నాకు ఓటేసే అవకాశం ఇస్తారనే నమ్మకం సన్నగిల్లుతాంది సారూ. ఈ సారిగనక బ్యాలెట్ ద్వారా నా ఓటు వేయిస్తే... మా ఓటు భద్రంగా ఉన్నట్టేనని నా నమ్మకం!
చివరిగా ఒక్క మాట సారూ... నా ఒంటి మీద సరిగ్గా గుడ్డల్లేవు, చేతిలో రూపాయి లేదు, సమాజంలో అంతస్తు లేదు. కానీ, పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక...
ఓటు వేస్తున్నప్పుడు... వేలిపై సిరా చుక్క పడుతున్నప్పుడు..నాకునేనే రాజును..
‘ఓటు’ అనే ఒక్క ఆయుధం ముందర ఎంతటి కోటీశ్వరుడైనా, ఎంతటి అధికార బలమున్నోడైనా తలవంచాల్సిందే! ఆ ఒక్క క్షణమే నన్ను నేను ఈ దేశ పౌరుడిగా గర్వపడేలా చేస్తుంది. అలాంటి నా గుండె చప్పుడును, నా ఆత్మగౌరవాన్ని దొంగల పాలు చేయకండి సారూ. నా ఓటును కాపాడడం అంటే... నాలాంటి కోట్లాది మంది పేదవాళ్ల బతుకుపై నమ్మకాన్ని కాపాడడమే. చదువుకున్న మీ లాంటి పెద్దోళ్లే చేతులెత్తేస్తే, రేపు నా బిడ్డలకి ప్రజాస్వామ్యం బతికే ఉందని నేను ఏ మొహం పెట్టుకుని చెప్పాలి సారూ? నా ఓటు కు కాపలాగా నిలబడండి సారూ!’ –సామాన్య ఓటరు


