పోటీకి భయపడి టీడీపీ నేతల దుశ్చర్య | - | Sakshi
Sakshi News home page

పోటీకి భయపడి టీడీపీ నేతల దుశ్చర్య

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

ప్రొద్దుటూరు : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి భయపడి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చింపారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికే పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చిందని రాచమల్లు తెలిపారు. నామినేషన్లు పూర్తి కావడంతో స్క్రూటినికి వెళ్లామన్నారు. అక్కడ తాము టీడీపీతో కొట్లాడుతున్నామా.. పోలీసులతో కొట్లాడుతున్నామా.. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నామా అనేది అర్థం కావడం లేదన్నారు. డీజీపీ, ఎస్పీలు కళ్లప్పగించి చూడటం తప్ప చేసిందేమి లేదని అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, నామినేషన్‌ పత్రాలను సమర్పించడానికి వెళ్లిన మహిళను వివస్త్రను చేసి చెరబట్టారన్నారు. సూపర్‌ 6 పథకాలను అమలు చేసి సుపరిపాలన అందించి ఉంటే, యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే, రైతులకు న్యాయం చేసి ఉంటే ఎందుకు ప్రజలు మీకు ఓట్లు వేయరన్నారు. స్క్రూటినికి సంబంధించి 14 కౌంటర్లను ఏర్పాటు చేసి 70 మంది ఉద్యోగులను నియమించారన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులతోపాటు చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి దాఖలు చేసిన నామినేషన్లు చెల్లకుండా చేశారన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి, మనుమడు అమల్‌ రెడ్డి వీటిని చెల్లకుండా చేశారన్నారు. ఇందుకు అంగీకరించని ఎన్నికల అధికారి హరికృష్ణపై టీడీపీ నేతలు దాడి చేశారని, మిగతా వారిని బెదిరించి బాధపెట్టారన్నారు.

163 నామినేషన్లు చెల్లకుండా చేశారు

మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డులకు సంబంధించి మొత్తం 215 నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో టీడీపీ అభ్యర్థులవి మినహాయించి మిగతా 163 నామినేషన్లను అధికారులు తిరస్కరించారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. తమ కౌన్సిలర్‌ అభ్యర్థి గుర్రం లావణ్యతోపాటు ప్రతిపాదకులు రాజశేఖర్‌ను డీఎస్పీ బాలస్వామిరెడ్డి కొట్టడంతో కుడికన్ను పూర్తిగా దెబ్బతినిందన్నారు. అలాగే తమ కార్యకర్త గౌతమ్‌ రెడ్డిపై దాడి చేయడంతో తలకు తీవ్రగాయమైందన్నారు.

పోలీసులు పిలుచుకెళ్లి కొట్టించారు

త్రీటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ సంజీవరెడ్డి తమ కార్యాలయం వద్దకు వచ్చి మీ కౌన్సిలర్‌ అభ్యర్థులు స్క్రూటినికి రావాలని భద్రత కల్పిస్తామని చెప్పడంతో తమ కౌన్సిలర్‌ అభ్యర్థులు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లామన్నారు. అక్కడ తమ అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడులు చేశారని, ఇదేమని ప్రశ్నించినందుకు తమ కార్యకర్తలపై డీఎస్పీతోపాటు వన్‌టౌన్‌ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి లాఠీ చార్జి చేశారన్నారు. చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడి చేసి ఆయన మెడలోని బంగారు గొలుసును లాక్కున్నారని, ఆయన వెంట వెళ్లిన ఆయన కుమారుడిపై దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అధికారులే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డిని ఎప్పటికీ తాము గుర్తు పెట్టుకుంటామన్నారు. ఫ్యాక్షన్‌కు వరద విషబీజాన్ని నాటారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పోరెడ్డి నరసింహారెడ్డికి భవిష్యత్తులో పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతానని రామల్లు తెలిపారు. 52 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో లాఠీ చార్జిలో గాయపడిన రాజశేఖర్‌, గౌతమ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

సుపరిపాలన అందించి ఉంటే ఎందుకు నామినేషన్‌ వేయనీయలేదు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాచమల్లు శివప్రసాదరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement