ఓటమి భయంతోనే అరాచకం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే అరాచకం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

ఓటమి భయంతోనే అరాచకం

కడప కార్పొరేషన్‌ : స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అరాచకం సృష్టించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర ఏ పార్టీలను నామినేషన్‌ వేయనీయకుండా ఎన్నికయ్యే ప్రతి ఒక్కరూ 2029లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీనామా చేయక తప్పదని అన్నారు. ఆదివారం సాయంత్రం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, డా.దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు కె.సురేష్‌ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ గూండాలు, రౌడీలు కట్టెలు, కత్తులు, రాళ్లతో కాపు కాశారని, నామినేషన్‌ కేంద్రం బయట, లోపల వాళ్లే ఉన్నారన్నారు. పోలీసులు వారికి అడుగడుగునా అండగా నిలిచారని, వారే లేకపోతే పరిస్థితి ఇలా ఉండదన్నారు. జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ ముఖ్య నాయకులందరినీ 144 సెక్షన్‌ పేరుతో గృహ నిర్బంధాలు చేశారని, టీడీపీ వర్గీయులు గుంపులుగా తిరుగుతూ తమ పార్టీ నాయకులపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించివేస్తున్నా పట్టించుకోలేదన్నారు. చివరకు కడపలో మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, ప్రొద్దుటూరులో పోరెడ్డి నరసింహారెడ్డి, బద్వేలులో రాచపూడి వెంకట సాయిక్రిష్ణ, పులివెందులలో వైఎస్‌ ప్రమీలమ్మ, రాజంపేటలో రేష్మ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని, స్క్రూట్నీలో ఎంత మంది మిగులుతారో తెలియదన్నారు. కడపలో 12 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేశారని, 19 మంది అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్‌ వేయించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా పోలీసులు లెక్క చేయలేదన్నారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేస్తే మీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకూ రమ్మనండి... నామినేషన్‌ వేయిస్తామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. వంద మీటర్ల పరిధిలోకి పోగలిగితే ఇక పోలీసులతో పనేముందని ప్రశ్నించారు. మా వాళ్లు పోలీస్‌స్టేషన్‌కు వస్తారు వారితో నామినేషన్లు వేయించాలని కోరినా అలా చేయలేమని చేతులెత్తేశారన్నారు. తమ అభ్యర్థులకు భద్రత కల్పించలేని పోలీసులు.. తమను గృహ నిర్బంధం చేయడానికి మాత్రం పదుల సంఖ్యలో పోలీసులను కాపలా పెట్టారని ఎద్దేవా చేశారు. నామినేషన్‌ వేయడానికి పోయిన వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించి వేస్తున్నా పోలీసులు కళ్లార్పకుండా చూశారే తప్ప వారికి రక్షణ కల్పించలేదన్నారు.

మాపై హత్యాయత్నం చేసినా స్పందించలేదు: ఎంపీ మేడా రఘునాథరెడ్డి

ఎంపీ, ఎమ్మెల్యేలపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేసి హత్యాయత్నం చేస్తే జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎస్పీల్లో కనీసం స్పందన లేకపోవడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ వాళ్లతో పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం కుమ్మకై ్కందని, 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. తాము ఉన్న ఇంటిని ధ్వంసం చేసి హత్యాయత్నం చేస్తే.. కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ, ఎస్పీలకు ఫోన్‌ చేస్తే ఏ ఒక్కరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కనీస మర్యాదకు తిరుగు కాల్‌ కూడా చేయలేదన్నారు. రిటైర్‌ అయినా ఇలాంటి అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 144 సెక్షన్‌ వైఎస్సార్‌సీపీకేనా, టీడీపీ మూకలకు వర్తించదా అని ప్రశ్నించారు. చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరించారు. సర్వేలు చేయించుకొని ఓడిపోతామని తెలిసే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు.

నామినేషన్‌ పత్రాలు చించేశారు : మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరులో ఈనెల 16,17 తేదీల్లో 14 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తన అనుచరులతో నామినేషన్‌ కేంద్రంలోకి చొరబడి వాటిని చించేశారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకు మైదుకూరులో ఓటు హక్కు కూడా లేదని, ఆయన్ను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులు వేసిన నామినేషన్లకు సంబంధించి రశీదులు ఇచ్చారని, ఈ విషయమై తాను నిలదీస్తే.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చించేశారని నామమాత్రంగా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ప్రజాస్వామ్యం పౌరుల చేతుల్లో లేదని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల చర్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇలాగైతే పోలీసులు, ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం పోతుందని హెచ్చరించారు.

ఎస్‌ఈసీ రాజీనామా చేయాలి :

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

ఎన్నికల నిర్వహణలో తీవ్రంగా విఫలమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి డిమాండ్‌ చేశారు. లోపభూయిష్టమైన విధానంతో ఎన్నికలు జరుపుతున్నారని, పోలీసులు, ఎన్నికల కమిషన్‌ టీడీపీతో కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. బద్వేలులో తమ అభ్యర్థులు వేసిన నామినేషన్లను మున్సిపల్‌ ఆఫీసుకు పోయి లాక్కుని చించివేశారన్నారు. తమ నామినేషన్లు ఎక్కడున్నాయి.. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఇవి పూర్తిగా ఫాల్స్‌ ఎలక్షన్స్‌ అని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇలాగే జరుగుతాయన్నారు.

గెలిచే ధైర్యం లేకనే : మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే దమ్ము, ధైర్యం లేకనే ఇలా నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. కడపలో 51వ డివిజన్‌ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్వర్ణలత నామినేషన్‌ వేస్తే.. ఆదివారం 3 గంటల తర్వాత.. 3 గంటల్లోపు మళ్లీ నామినేషన్‌ వేయాలని నోటీసు అతికించారన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఏ నాకొడుకు వచ్చి నామినేషన్‌ వేస్తాడో రమ్మను అని టీడీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి సవాల్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ ఎన్నికలను రద్దు చేసి, ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కడప నగర మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌ కుమార్‌, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ రౌడీ మూకల దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న వైనం

పోలీసులు మమ్మల్ని గృహ నిర్బంధంచేసి వారికి అండగా నిలిచారు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement