కడపలో రాళ్లు, కట్టెలతో వీరంగం | - | Sakshi
Sakshi News home page

కడపలో రాళ్లు, కట్టెలతో వీరంగం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

కడపలో రాళ్లు, కట్టెలతో వీరంగం

కడప కార్పొరేషన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలో మూడో రోజు కూడా అదే రాక్షక కాండ రిపీట్‌ అయ్యింది. ఆదివారం కడపలోని 8 నామినేషన్‌ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో రౌడీ మూకలు రాడ్లు, కట్టెలు చేతుల్లో పట్టుకొని కాపలా కాసి, టీడీపీ వారు మినహా.. ఎవరు నామినేషన్‌ వేయడానికి వచ్చినా అడ్డగించి దాడులు చేశారు.

బీజేపీ నాయకుల ధర్నా

జయనగర్‌ కాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నామినేషన్‌ కేంద్రం వద్ద ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగింది. వందల సంఖ్యలో అల్లరి మూకలు నామినేషన్‌ కేంద్రం చుట్టూ మాటు వేసి.. ఎవరూ నామినేషన్‌ వేసేందుకు రాకుండా కట్టడి చేశారు. నిన్న కట్టెలు, రాడ్లతో కాపు కాసిన టీడీపీ మూకలు, ఆదివారం ప్లాస్టిక్‌ పైపులు చేతుల్లో పట్టుకొని స్వైర విహారం చేశారు. మధ్యాహ్నం నామినేషన్‌ వేసేందుకు 6వ డివిజన్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి పుట్టిక వెంకట రమణ, వెంకట సుబ్బయ్య నామినేషన్‌ వేసేందుకు రాగా టీడీపీ నాయకులు వారిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు నామినేషన్‌ కేంద్రం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ముఖ్యమంత్రికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి అమ్ముడుపోయారంటూ నినాదాలు చేశారు.

మరియాపురం నామినేషన్‌ కేంద్రం వద్ద..

కడప నగరంలోని మరియాపురం నామినేషన్‌ కేంద్రం వద్ద 53వ డివిజన్‌ నుంచి 66వ డివిజన్‌ వరకు అభ్యర్థులు నామినేషన్‌ వేయాల్సి ఉండగా.. కేవలం టీడీపీ అభ్యర్థులే పది మంది ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. గత మూడు రోజులుగా నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో 14 డివిజన్లకు గాను టీడీపీ తరఫున 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి రోజున మాత్రమే ఈ నామినేషన్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మూడు డివిజన్లకు నామినేషన్లను వేశారు. 144 సెక్షన్‌ ఉల్లంఘన జరిగినా.. పోలీసులు పట్టించుకోలేదు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద..

ఎర్రముక్కపల్లెలోని గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల వద్ద దాడులు చేయడానికి వీలుగా అల్లరి మూకలు కంకర, రాళ్లు సిద్ధం చేశారు. వందల సంఖ్యలో టీడీపీ మూకలు అన్ని వైపులా మాటు వేశారు. నామినేషన్‌ వేసేందుకు ఎవరు వచ్చినా వారిపై దాడులు చేసి తరిమి కొట్టారు. నామినేషన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్‌.మాధవిరెడ్డి పరిశీలించారు. నాగరాజుపేట, పాతకడప, తెలుగుగంగ కార్యాలయం, కాగితాలపెంట నామినేషన్‌ కేంద్రాల వద్ద కూడా అల్లరి మూకలు గుంపులుగా కాపు కాశాయి. పాతకడప నామినేషన్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడి బైక్‌ను ధ్వంసం చేశారు.

హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన

పోలీసులు

నామినేషన్‌ కేంద్రాల వద్ద మాటు వేసిన కిరాయి గూండాలు

చివరి రోజు నామినేషన్లు వేయకుండా అడ్డగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement