● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళా అభ్యర్థుల పైనా టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి కార్యాలయంలో ఆదివారం రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వకుండా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, కొండారెడ్డిలు టీడీపీ నాయకులు, గూండాలను మోహరించి అడ్డుకున్నారని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో వందలాది మంది రౌడీ మూకలు తిష్టవేసి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేయడంతోపాటు వారిపై దాడులు చేశారన్నారు. బయట పోలీసులు ఉండగా లోపల అధికార టీడీపీ రౌడీలు అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. మహిళా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నారు. మాజీ కౌన్సిలర్లు ఉట్టిరమణమ్మ, భద్రమ్మ, శ్రీవల్లి అనే అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని వారిపై దాడికి యత్నించారని విమర్శించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా అభ్యర్థులను సైతం వదలకుండా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. నామినేషన్ పత్రాలను కాపాడుకునే క్రమంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఇది అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులను నిర్భందించి వారి మొబైల్ ఫోన్లు, కెమెరాలను టీడీపీ మూకలు లాక్కున్నారని, కొన్నింటిని నేలకేసి కొట్టారని తెలిపారు.
నామినేషన్ వేయకుండా..
పోలీసులు అడ్డుకోవడం ఏమిటి?
నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తనను ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, 12 మంది పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఒక వైపు పార్టీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించకపోవడం, మరోవైపు లోపల నామినేషన్ పత్రాలను లాక్కొంటున్నారని పోలీస్ అధికారుకులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసు అధికారులే దగ్గరుండి సింహం గుహలోకి పంపినట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ రౌడీ మూకల వద్దకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వయసులో ఏం సాధించాలని నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన సోదరుడు రాఘవరెడ్డిలు ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడుతన్నారని అన్నారు. మీ చేష్టలను చూసి ప్రొద్దుటూరు ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు.


