బద్వేలు (అట్లూరు) : బద్వేలు మున్సిపాలిటీ నామినేషన్ ప్రక్రియలో చివరి రోజు ఆదివారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రానివ్వకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి ఆదివారం ఉదయం నుంచే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి తన అనుచర వర్గాన్ని సుమారు 500 మందితో మున్సిపల్ కార్యాలయం వద్ద మొహరించారు. ఇక్కడే టెంట్ వేసి మరీ తిష్టవేశారు. ఆయన అనుచర వర్గం మినహా ఏ ఒక్కరు వచ్చినా నామినేషన్ పత్రాలను చించేయడం, వారిని చితకబాది బయటికి పంపించారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు చిత్రీకరించగా వారి సెల్‌ఫోన్లను తీసుకుని భయబ్రాంతులకు గురిచేశారు. నామినేషన్ ప్రక్రియ కవర్ చేసేందుకు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యనారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో మీడియా బృందం కొద్ది సేపు బైఠాయించి నిరసన తెలిపింది.


