ప్రజాస్వామ్యం ఖూనీ! | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ!

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

ప్రజాస్వామ్యం ఖూనీ!

పులివెందుల/రూరల్‌ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తోందని కడప ఎంపీ వై ఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న ఆడిటోరియంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులను నామినేషన్‌ వేసేందుకే వెళ్లనివ్వకుండా చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌ రెడ్డి నివాసం దగ్గరే పోలీసులనుపెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. దాడులతో వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కలేరన్నారు. నామినేషన్లు వేయకుండా ఎన్నికలు ఎందుకు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కూటమి నాయకులు గెలవలేమన్న నమ్మకంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు జరిపేందుకు దమ్ము, ధైర్యం టీడీపీకి లేదన్నారు. ప్రజల మీద టీడీపీకి నమ్మకం లేదన్నారు. అందువల్లే ఎన్నికలు నిర్వహిస్తే పులివెందుల ప్రజలు ఓటు వారికి వేయరనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఆదివారం ఉదయం కూడా అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు వెళుతుంటే పోలీసులను అడ్డంపెట్టి నామినేషన్‌ వేయకుండా అడ్డుపడ్డారన్నారు. సాధారణంగా ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీలకు హోరాహోరీగా ఎన్నికలు జరగాలి కానీ, పులివెందులలో మాత్రం వైఎస్సార్‌సీపీకి, పోలీసులకు మధ్య ఎన్నికలు జరిగినట్లు ఉందన్నారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడంవల్ల భవిష్యత్‌లో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో మాట్లాడారన్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా.. అడ్డుకోవడం సరికాదన్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఎస్‌ఈసీ అధికారులకు నామినేషన్‌ పత్రాలను పంపామన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో 19 నామినేషన్లు ఎస్‌ఈసీకి ఆన్‌లైన్‌లో పంపామన్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఆన్‌లైన్‌లో పంపిన 19 నామినేషన్లు అంగీకరించి.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పులివెందుల ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి జరిగిన ప్రతి విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్న లక్ష్యంతో పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఉత్సాహంగా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని వారికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మొదటిరోజు 21 నామినేషన్లు వేయడం జరిగిందని, రెండవ రోజు మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులతో నామినేషన్లు వేసేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు ఉదయమే వచ్చి టీడీపీ అభ్యర్థులు ఉదయం వేస్తారని, మీరు 1.30గంటల ప్రాంతంలో నామినేషన్‌ వేసేందుకు రావాలని పులివెందుల పోలీసులు చెప్పారన్నారు. అప్పుడు కూడా నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్లినా కూడా పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. 3వ రోజు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మతో ఎస్‌ఈసీకి వినతి పత్రం కూడా ఆన్‌లైన్‌ ద్వారా పంపామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు వైఎస్సార్‌సీపీకి చెందినవారు నామినేషన్‌ వేయాల్సి ఉందని, వారిని నామినేషన్‌ వేసే విధంగా పోలీసులకు అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు.

దాడులతో వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కలేరు

నామినేషన్లు వేయనీయకుండా ఎన్నికలు జరపడం ఎందుకు?

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement