వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వందశాతం వైఎస్సార్‌సీపీదే గెలుపని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రొద్దుటూరులో ఎన్నికలు జరిగే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. అందుకు కారణం కూటమి ప్రభుత్వం అరాచక చర్యలేనని ధ్వజమెత్తారు. పోలీసులు, టీడీపీ గూండాలు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దాడులు చేసి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతాయని నమ్మకం నాకు లేదు. జింక పిల్లని సింహం గుహలోకి తీసుకెళ్ళి వదిలినట్టు.. పోలీసులే ప్రజాస్వామ్యం అనే జింక పిల్లని తీసుకెళ్లి టీడీపీ అనే తోడేళ్ల ముందు వదిలేస్తున్నారు. పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటిని పేరుతో తిరస్కరించేందుకు యత్నాలు చేస్తున్నారు. పోలీసులే పచ్చచొక్కా మాటున పనిచేస్తున్నారు.
నామినేషన్లు వేయడానికి యుద్ధం, స్క్రూటినికి వెళ్ళడానికి మరో యుద్ధం .. డిసెంబర్ 2 వరకు టీడీపీ గుండాలతో , పోలీసులతో యుద్ధం చేసే పరిస్థితి. ఎన్నికలు సజావుగా సాగితే టీడీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బలంతో .. తప్పకుండా తమ అభ్యర్థులను గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి


