విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ కొనసాగిస్తున్న దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. 96 చోట్ల హింసాత్మక ఘటనలు, నామినేషన్ లాక్కోవడం, పోలీసులు అడ్డుకోవడం వంటివి జరిగాయి. రెండు చోట్ల నిప్పు పెట్టారు. 22 చోట్ల నామినేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. చైర్మన్ నామినేషన్ వేయనివ్వలేదు. మైదుకూరు ఎన్నిక వాయిదా వేశారు. మైదుకూరుతో పాటు బద్వేల్ ఇతర ప్రాంతాల్లో నామినేషన్ వేయనివ్వలేదు.
తెలుగుదేశం పార్టీ గూండాలు ఎలా ప్రవర్తించారో, పోలీసులు ఎలా సహకరించారో తెలుపుతూ, ఎంపీలపై జరిగిన దాడి గురించి చెబుతూ అన్ని వివరాలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాము. నామినేషన్ వేసే ప్రదేశాల్లో లోపల బయట సీసీటీవీ కెమెరాలు పెట్టాలని చెప్పాము. కానీ, స్టేట్ ఎన్నికల కమిషన్ చేయలేకపోయింది. ఎక్కడ అక్రమాలు, ఎక్కడ నామినేషన్ అడ్డుకొన్నారో అక్కడ ఎన్నికలు తిరిగి ప్రారంభించాలి. 22 చోట్ల తిరిగి ఎన్నికలు జరపాలి.
ఎన్నికల కమిషన్ కళ్లు తెరవాలి
ప్రజలకు చంద్రబాబు మేలు చేస్తే చెప్పి ఓట్లు వేయించుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ‘‘బ్యాలెట్ ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు నమ్మకం లేదు. బ్యాలెట్ కాదు బుల్లెట్ కావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తీర్మానం చేసుకుని మీకు కావాల్సిన వ్యక్తులను చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్లుగా పెట్టుకోండి. ఎన్నికల కమిషన్ కళ్లు తెరవాలి. గాంధీ గారి మూడు కోతుల్లా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది. స్టేట్ ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నాము. ఎన్నికలు హైజాక్ అయిపోయాయి.
తాను రాసిన స్క్రిప్ట్ ను అమలు చేయడానికి కొంతమంది కలెక్టర్లను, ఎస్పీలను చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. కోయ ప్రవీణ్ అనే వ్యక్తి అరాచకం సృష్టిస్తున్నారు. ఎన్నికలు జరిగితే గెలుపు వైఎస్సార్‌సీపీదే అనే విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో 22 చోట్ల తిరిగి ఎన్నికలు పెట్టాలి. ఒక్క అధికారి మీద కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటి? ఎంపీ చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కొని చింపారు. మరో ఎంపీ బయటకి రాకుండా ముళ్ల కంచె వేశారు. చంద్రబాబు.. గౌతమ్ బుద్ధుడు.. గాంధీ మహాత్ముడిలా కబుర్లు చెబుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.


