కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో హాజరై వినతిపత్రాలు అందజేయాలని కోరారు. అలాగే గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా
స్పందన తెలియజేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ ఆర్ కోడ్ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్‌ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్‌కి, వైఎస్సార్ కడప జిల్లా వారు 08562242457 నంబర్లకు కాల్ చేయా లని సూచించారు.
రేపు జెడ్పీ స్థాయీ
సంఘ సమావేశాలు
కడప సెవెన్‌రోడ్స్ : ఉమ్మడి వైఎస్సార్ కడపజిల్లా స్థాయీ సమావేశాలు ఈనెల 22వ తేదిన కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశాలకు ఉమ్మడిజిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.
భక్తిశ్రద్ధలతోగణేష్ లడ్డూ ప్రసాద వేలం
పులివెందుల టౌన్ : పట్టణంలోని స్థానిక మైత్రిలేఔట్‌లోని ఓపెన్ సమీపంలో కొలువుదీర్చిన శేష వినాయక విగ్రహాన్ని ఆదివారం ఏడవ రోజు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ప్రజలు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ వేలం పాటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీపతి చిన్నబాలుడు, కుమారుడు శ్రీపతి చక్రవర్తి రూ. 6,55,116 లక్షలకు వినాయక లడ్డూను దక్కించుకున్నా రు. కార్యక్రమంలో గజానన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మాడా వీధిలో గణేషుడి లడ్డూ రూ. 5.01 లక్షలు పలికింది. మామిళ్ల మేఘమాలరెడ్డి రూ. 5,01,000కు పాట పాడి దక్కించుకున్నారు. వేలం పాటలో సొంతం చేసుకున్న స్వామి వారి ప్రసాదాన్ని ఉత్సవ కమిటీ వారు మామిళ్ల మేఘమాల రెడ్డి కి అందజేశారు. అనంతరం వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది.


