● రాజంపేట నుంచే కనెక్టివిటీ
● తెరపైకి రైల్వే ప్రతిపాదన
రాజంపేట : రాజంపేట నుంచి నెల్లూరు (సింహపురి) మధ్య సరికొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 120 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన మార్గానికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపకల్పన కోసం కసరత్తు ప్రారంభమైంది.ప్రస్తుతం కడప, రాజంపేట ప్రాంతాల నుంచి నెల్లూరు వెళ్లాలంటే కేవలం బస్సు ప్రయాణమే దిక్కుగా మారింది. రాత్రి వేళల్లో అటవీ ప్రాంత చెక్‌పోస్టు నిబంధనల వల్ల బస్సు ప్రయాణాలు కూడా కష్టతరంగా మారుతున్నాయి. రైలులో వెళ్లాలంటే రేణిగుంట జంక్షన్ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా రాజంపేట – నెల్లూరు లైన్ అందుబాటులోకి వస్తే దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల నెరవేరుతుంది.
ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
తూర్పు – పశ్చిమ అనుసంధానం : పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల నుంచి ఏపీలోని కోస్తా తీర ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.
పోర్టుల అభివృద్ధి : రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుంచి కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరుకు రవాణా ఎంతో సులభతరం అవుతుంది.
జంక్షన్‌గా రాజంపేట : ఈ కొత్త లైన్ గనుక ఆమోదం పొందితే రాజంపేట రైల్వే స్టేషన్ ఒక ప్రముఖ జంక్షన్‌గా మారి వ్యాపార, రవాణా పరంగా అభివృద్ధి చెందుతుంది.


