కడప అగ్రికల్చర్ : జిల్లాలో సాగు చేసిన ఆరుతడి పంటలతోపాటు ఉద్యాన పంటలకు ప్రస్తుత వర్షాలు కాసింత జీవం పోశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామువరకు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. మరో పది రోజుల్లో రబీ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో వర్షాలు ఇలాగే కొనసాగితే జిల్లాలో శనగపంట విస్తృతంగా సాగ య్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది రైతు లు శనగపంట సాగు చేసుకునేందుకు పొలాలను దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా వర్షాధారంతోపాటు బోర్ల కింద 40,449 హెక్టార్లలో వరితోపాటు ఆరుతడి పంటలైన పత్తి, కంది, మినుము, పెసర, మొక్కజొన్న, సజ్జ, వంటి పంటలు సాగయ్యాయి. ప్రస్తుత వర్షాలు చీనీ తోటలకు మేలు చేకూరుస్తాయని రైతులు తెలిపారు. కాగా జిల్లాలోని ఈదురుగాలులు, వర్షాలకు పలు ప్రాంతాల్లో అరటి పంట నేలకొరిగింది. దీంతో రైతన్నలకు లక్షల రూపాయల్లో పంటనష్టం వాటిల్లింది.
కొండాపురంతో అత్యధికంగా..
జిల్లాలో కొండాపురం మండలంలో అత్యధికంగా 126.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే పులివెందుల్లో 123.6, పెండ్లిమర్రిలో 78.4, సీకేదిన్నె 55.4, వేంపల్లి 55.2, జమ్మలమడుగు 51.6, సింహాద్రిపురం 37.6, లింగాల 34, ఒంటిమిట్ట, మైలవరంలలో 32.4, నందలూరు, మైదుకూరులలో 32, చాపాడులో 30.2,రాజంపేటలో 31.4, చక్రాయపేటలో 31, ఖాజీపేట 30, అట్లూరు28.4, ఎర్రగుంట్ల 28, సిద్దవటంలో 26.8, ప్రొద్దుటూరు 25, ముద్దనూరు 24.8, కడప 24.4, చెన్నూరు 23.2, తొండూరు 20.4, వేముల 20, వీఎన్‌పల్లి 18.2, పెద్దముడియం 14.2, దువ్వూరు 12.2, బి.కోడూరు 11.8, పోరుమామిళ్ల 11.2, రాజుపాలెం 9.4, కమలాపురం 7.4, వల్లూరు7.2, బి.మఠం 6.2, కాశినాయన, వీరబల్లి 4.2, బద్వేల్, గోపవరం 4, టి.సుండుపల్లి మండలంలో 3.2 మి.మీ వర్షం కురిసింది.
జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం
కొండాపురంలో అత్యధికంగా 126.4 మి.మీ వర్షం
వాడుముఖం పట్టిన పంటలకు
కాసింత ఉపశమనం


