రాజుపాళెం: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పల్లెల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు లేక, కేసీ కాలువకు నీరు రాక కాలువలన్నీ ఎండిపోయాయి. కనుచూపు మేరలో పొలాలన్నీ బీడు భూములుగా మారడంతో రైతులు సాగుకు ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కరువు ప్రభావం వ్యవసాయ కూలీలపై తీవ్రంగా పడింది. సొంత గ్రామాల్లో పనులు కరువై కుటుంబం గడవడం కష్టంగా మారడంతో, రాజు పాళెం మండలంలోని పలు గ్రామాల కూలీలు 20 రోజులుగా ఇతర మండలాలకు వలస వెళ్తున్నారు. అక్కడ వరినాట్లు, వరిమళ్లలో కలుపు తీయడం, మిర ప, పసుపు పంటల్లో పనుల కోసం వెతుకులాడుతున్నారు. స్థానికంగా బోరుబావుల్లో సైతం నీరు అడుగంటడంతో ఆరతడి పంటల సాగు కూడా నిలిచిపోయిందని, ప్రభుత్వం కరువు పరిస్థితులపై స్పందించి ఆదుకోవాలని రైతులు, కూలీలు కోరుతున్నారు.


