● రేణిగుంట–గుంతకల్లు మధ్య
3, 4 లైన్ల మార్గం
● రూ.4,500 కోట్లతో
ముంబై–చైన్నె రైల్వే కారిడార్ విస్తరణ
● కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
● గంటకు 150 కి.మీ వేగంతో
దూసుకెళ్లనున్న రైళ్లు
● కృష్ణపట్నం ఓడరేవుకు సరకు రవాణా మరింత సులువు, వేగవంతం
● రైల్వే చట్టం కింద వైఎస్సార్ కడప,
తిరుపతి, అనంతపురం జిల్లాల్లో
భూసేకరణకు నోటిఫికేషన్
రాజంపేట: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాలలో ఒకటైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. బంగాళాఖాతం – అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన ముంబై–చైన్నె రైల్వే కారిడార్‌లో కొత్తగా మూడు,నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 4,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
ప్రతి 7.5 నిమిషాలకో రైలు..
గంటల తరబడి నిలిపివేతలకు చెక్
310 కిలోమీటర్ల పొడవు కలిగిన రేణిగుంట–గుంతకల్ సెక్షన్ మధ్య ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 190 రైళ్లు నడుస్తున్నాయి. అంటే సగటున ప్రతి 7.5 నిమిషాలకు ఒక రైలు ఈ ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం ఒక రైలుకు, మరో రైలుకు మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడమే కాకుండా, రైళ్లను చిన్న చిన్న స్టేషన్లలో లేదా ఔటర్లలో గంటల తరబడి నిలిపివేయాల్సి వస్తోంది. కొత్తగా 3, 4 లైన్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది.
కృష్ణపట్నం పోర్టుకు మహర్దశ – రైతులకు వరం
ఈ లైన్ల నిర్మాణం పూర్తయితే కృష్ణపట్నం ఓడరేవుకు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులను అత్యంత వేగంగా చేరవేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ కొత్త లైన్లలో రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన సాంకేతికతతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో సున్నపురాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణా వేగవంతం కావడం వల్ల రైల్వే శాఖకు ఆదాయం భారీగా పెరుగుతుంది. అలాగే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో నగరాలకు చేర్చవచ్చు. అంతేకాకుండా, ఈ కారిడార్ వెంబడి ఉన్న పలు గ్రామాలు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
రంగంలోకి యంత్రాంగం.. భూసేకరణ షురూ
ఈ మెగా ప్రాజెక్టు కోసం ఆరు నెలల కిందటే రైల్వే అధికారులు క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్ర అనుమతులు రావడంతో, రైల్వే చట్టం 1989 సెక్షన్ 2(37ఎ) కింద దీనిని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ భూసేకరణకు అధికారులు ముందడుగు వేశారు. ఈ మేరకు వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూమిని సేకరించేందుకు రైల్వే యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ముంబై–చైన్నె రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ 310 కిలోమీటర్ల మార్గంలో నిత్యం ప్రయాణికులు, సరకు రవాణా రైళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఫోర్‌లైన్ నిర్మాణం పూర్తయితే రైళ్లు గంటల తరబడి ఔటర్లలో వేచి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని, ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతాయని నేతలు స్పష్టం చేశారు.


