● దక్షిణ భారత్‌లోనే ప్రధాన పెట్టుబడి
కేంద్రంగా మారుస్తాం
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సిటీ: వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న కడపను పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక హబ్‌గా మార్చి, దక్షిణ భారతదేశంలోనే ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం కడప కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటైన ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, పలువురు పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రం యొక్క ప్రత్యేకతలను వివరించారు. పెట్టుబడిదారులు తమ వ్యాపార ఆలోచనలతో వచ్చిన రోజు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. పెట్టుబడిదారులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పరిశ్రమలకు అనువైన ప్రాంతాలు, పారిశ్రామిక భూముల లభ్యత, నీరు, విద్యుత్, రహదారి అనుసంధానం వంటి పూర్తి వివరాలను అందిస్తారు. భూమి కేటాయింపు అనంతరం వివిధ శాఖలను సమన్వయం చేస్తూ అన్ని అనుమతులను వేగంగా ఇప్పిస్తారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే బాధ్యతను కూడా ఈ కేంద్రమే చూసుకుంటుంది. బయటి రాష్ట్రాల పెట్టుబడిదారులకు ప్రత్యేక సహకారం అందించడంతో పాటు, స్థానిక యువత, విద్యార్థి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వారి స్టార్టప్‌లకు అవసరమైన తోడ్పాటును అందిస్తారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ తదితరులు పాల్గొన్నారు.


