జమ్మలమడుగు: మైలవరం జలాశయం పరిధిలోని నిషేధిత ప్రభుత్వ భూములను ఆక్రమించి, కొందరు వ్యాపారులు దాదాపు 8కి పైగా అక్రమ కేంద్రాలలో పూర్తిగా నిషేధించిన శ్రీక్యాట్‌ఫిష్‌శ్రీ రకం చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా సున్నపురాళ్లపల్లి సమీపంలో, పి.బొమ్మెపల్లి రహదారిలో ఉన్న చెరువులో చేపలను అనధికారికంగా పెంచుతున్నారు. నాణ్యమైన దాణా ఖర్చు తగ్గించుకోవడానికి ప్రతి ఆదివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల చికెన్ సెంటర్ల నుంచి కుళ్లిన కోడి వ్యర్థాలను తెచ్చి వీటికి ఆహారంగా వేస్తున్నారు. ఈ చెరువుల వల్ల వచ్చే తీవ్ర దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇక్కడ పెంచిన చేపలను కడపతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు భారీ ఎత్తున ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మత్స్య శాఖ అధికారులు, స్థానిక కూటమి పాలకుల రాజకీయ మద్దతు ఉండటంతోనే నిర్వాహకులు ఈ దందాకు తెగబడుతున్నారని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
క్యాట్‌ఫిష్ పెంపకం ఎందుకు నేరం?
మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నందున భారత ప్రభుత్వం బయో–సేఫ్టీ నిబంధనల ప్రకారం ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ (మాగూర్) పెంపకం, విక్రయాలను దేశంలో పూర్తిగా నిషేధించింది. కుళ్లిన కోడి వ్యర్థాలను తిని పెరిగే ఈ చేపల వల్ల మనుషులకు క్యాన్సర్, కాలేయ వ్యాధులు, తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇవి క్రూరమైన స్వభావం కలిగి ఉండి, చెరువుల్లోని ఇతర స్థానిక జలచరాలను వేటాడి తినేయడం ద్వారా సహజ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తాయి. చట్టప్రకారం ఈ నిషేధిత చేపలను పెంచినా, రవాణా చేసినా కఠినమైన జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం


