చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో నేడు శ్రావణ మాసం చివరి శనివారోత్సవం జరుగనుంది. చివరి శనివారం కావడంతో గత వారం కంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ వర్గాలతోపాటు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు తెలిపారు. అందుకు అనుగుణంగా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేసినట్లు వారు చెప్పారు. క్యూలైన్ల వద్ద తాగునీటి వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆలయ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాతలచే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కడప రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకుడు ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రసాద్ తెలిపారు.
క్షేత్రోత్సవం నిర్వహణపై ట్రయల్ రన్
అశేష భక్త జనం మధ్య నిర్వహించే క్షేత్రోత్సవానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వ హించారు. ఆంజనేయస్వామి వాహనం అయిన ఒంటైపె స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి భక్తులు ఎలా పల్లకీని మోయాలి అనే అంశంపై ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కొండకమర్లకు చెదిన అర్జున్ అనే భక్తుడు రూ.4 లక్షల విలువ గల స్వామి వారి తిరుచ్చి(పల్లకీ), తండ్లు(మోతకర్రలు) సమర్పించారు.
ఆస్థానంతో ఉత్సవాల ముగింపు
శ్రావణమాసం చివరి శనివారం రాత్రి జరిగే క్షేత్రోత్సవం, ఆస్థానంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా వెళ్లి పాపాఘ్ని నదిలో వేద పండితులచే ఆస్థానం నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం, మహాతిరుమంజనం, అలంకారం, విశేష నైవేద్యాలు, మహామంగళ హారతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని వివరించారు.
కట్టుదిట్టంగా భద్రత
భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆర్కేవ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై శ్రీప్రియ తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలు ఉన్నందున సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు, మహిళా పోలీసులు, హోంగార్డులతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. వాహనాలను గండిలోకి అనుమతించబోమని చెప్పారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని వారు కోరారు. వృద్ధులు, మహిళల కోసం అద్దాలమర్రి క్రాస్ ఇడుపుల పాయ క్రాస్ వద్ద నుంచి గండిలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఉచితంగా తిప్పిస్తున్నట్లు వారు వివరించారు.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి
ఆంజనేయస్వామి ఆలయంలో.. శ్రావణ మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రకృతి రమణీయత నడుమ, పాపాగ్ని నది తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనార్థం ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లా నలుమూలల నుంచే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నేడు చివరి శనివారోత్సవం
భారీగా తరలిరానున్న భక్తులు


