రక్తదాతలే నిజమైన హీరోలు: సినీ నటుడు శ్రీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలే నిజమైన హీరోలు: సినీ నటుడు శ్రీకాంత్‌

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

కడప ఎడ్యుకేషన్‌: రక్తదానం మానవత్వానికి ప్రతీక అని, ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలే నిజమైన హీరోలని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ కొనియాడారు. కడప ఊటుకూరు ప్రకృతి నగర్‌లోని పీఆర్‌ఆర్‌ఎం ఫార్మసీ కళాశాలలో ‘ఖూన్‌ కా రిష్తా’ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, అత్యవసర సమయాల్లో ఎంతోమందికి రక్తాన్ని అందిస్తూ నిరంతరం సేవలందిస్తున్న కడప సమాచార పౌర సంబంధాల శాఖ ఫొటోగ్రాఫర్‌ పీఎండీ సోహైల్‌ అలీ ఖాన్‌ను నటుడు శ్రీకాంత్‌ శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఒక మనిషి మరో మనిషికి ఇవ్వగలిగే అత్యంత విలువైన కానుక రక్తదానమేనని పేర్కొన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సల వేళ సరైన సమయానికి రక్తం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎటువంటి అపోహలు లేకుండా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గౌరవ అధ్యక్షుడిగా హాజరైన ప్రొద్దుటూరు సినీ నిర్మాత కె. రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి.. నిజమైన హీరోలుగా నిలవండి‘ అనే సందేశంతో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య, విద్యా రంగాల ప్రముఖులు, సినీ అభిమానులు, ట్రస్ట్‌ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement