పులివెందుల రూరల్ : వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంతో రైలు బండి కల సాకారం కానుందని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల ప్రత్యేక చొరవతో పులివెందుల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షుడు రసూల్, మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధర్ రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముద్దనూరు – పులివెందుల మీదుగా ముదిగుబ్బ, పుట్టపర్తి రైల్వేలైన్‌కు సంబంధించి తాజాగా అధికారులు రూ.2.505 కోట్ల అంచనా వ్యయంతో 105.31 కిలోమీటర్ల సామాగ్రి ప్రాజెక్ట్ రిపోర్ట్ డీపీఆర్‌కు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించారన్నారు. ఇది పులివెందుల ప్రజలేతో పాటు రాయలసీమ ప్రాంతానికి శుభ పరిణామమన్నారు. ఈ రైల్వేలైన్ పులివెందుల మీదుగా వచ్చేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అప్పటి ప్రభుత్వం కృషి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిరంతర ప్రయత్నాలతో డీపీఆర్ రైల్వేబోర్డుకు సమర్పించారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పులివెందుల మీదుగా ప్రత్యామ్నాయ రైల్వే అలైన్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖలతో పలుమార్లు చర్చలు జరిపారన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అవసరాన్ని వివరించారన్నారు. లిఖితపూర్వకంగా లేఖలు కూడా సమర్పించారన్నారు. వాటి ఫలితంగానే ముద్దనూరు – పులివెందుల – ముదిగుబ్బ – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మార్గంలో సర్వేకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇచ్చిన అధికారిక సమాధానాల్లో కూడా ఈ ప్రత్యామ్నాయ అలైన్మెంట్‌కు సంబంధించి సర్వే మంజూరనే విషయం స్పష్టంగా నమోదైందన్నారు. అదే ప్రతిపాదికను డీపీఆర్ దశకు చేరుకోవడం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డి నిరంతర కృషికి నిదర్శనమన్నారు. పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ రావడంతో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా వ్యాపార, విద్య, వైద్య, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దశరథరామిరెడ్డి, హఫీజ్, ఈశ్వరయ్య, మహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పులివెందులకు రైలు మార్గం.. సుగమం
వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో నెరవేరనున్న చిరకాల స్వప్నం


