● ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు
ఖాజీపేట : కొత్తపేట గ్రామంలో సాగులో ఉన్న 1.43 ఎకరాల భూమిపై వివాదం చెలరేగడంతో 250 చీనీ చెట్లను నరికి వేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నంబర్ 467లో 1.43 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి సాగు చేస్తున్నాడు. 250 చీనీ చెట్లతోపాటు పసుపు పంటను అంతర్ పంటగా సాగు చేశారు. అయితే ఈ భూమిపై వారసత్వ పోరు 2018 నుంచి నడుస్తోంది. కొత్తపేట గ్రామానికి చెందిన లక్షుమ్మ, చిన్నమ్మలు అక్కాచెల్లెళ్లు. లక్షుమ్మ వారసులైన రమణారెడ్డి ఈ భూమి మాది వారసత్వంగా మాకు సక్రమించిందని, అలాగే చిన్నమ్మ వారసులైన దశరథ రామిరెడ్డి మాకు చెందుతుందని చెబుతున్నాడు. ఇలా ఇరువురి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై ఇరువర్గాల వారు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. అయితే బుధవారం రాత్రి పాలకొలను లక్ష్మీదేవమ్మ, నారాయణమ్మ, దశరథరామిరెడ్డిలు పొలంలోకి వచ్చి 250 చెట్లు నరికేశారని ఖాజీపేట పోలీసులకు రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ భూమి తమకు వారసత్వంగా వచ్చినదని, కావున తమ భూమిలో చెట్లను తామే నరికేశామని దశరథరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో ఈ భూమి ఎవరిదో తేల్చాలని ఖాజీపేట సీఐ వంశీధర్ ఖాజీపేట తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. భూ హక్కుదారులు తేలిన తరువాత కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇరు వర్గాల వారిని పిలిచి రికార్డుల పరిశీలన చేపట్టారు.


