కడప సెవెన్‌రోడ్స్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము దువ్వూరులో అత్యధికంగా 42.4 మి.మీ వర్షం కురవగా పెద్దముడియంలో 30.2, రాజుపాలెంలో 29.8, వేంపల్లిలో 27.2, అట్లూరులో 14.2, బి.మఠంలో 12.8, మైలవరంలో 10.4, చక్రాయపేటలో 9.6, నందలూరులో 8.6, కలసపాడులో 8.4, చాపాడులో 7.8, గోపవరంలో 7, జమ్మలమడుగు, మైదుకూరులలో 5.4, లింగాలలో 5.2, బద్వేల్‌లో 4.4, రాజంపేటలో 4.2, వీరబల్లిలో 3.8, ప్రొద్దుటూరులో 3.6, వేములలో 3, కాశినాయనలో 2.8 , కమలాపురంలో 2.6, పోరుమామిళ్లలో 2.2, చెన్నూరులో 1.8 , ఖాజీపేటలో 1.4 మి.మీ వర్షం కురిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటల సాగుకు కూడా అనుకూలమని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రమణేశ్వరావు తెలిపారు.
సమాజ నిర్మాణంలో
వైద్యులే కీలకం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశంలో వైద్య సేవల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతున్న తరుణంలో ప్రతి వైద్యుడు నాణ్యమైన సేవలు అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగర పరిధిలోని ఫాతిమా మెడికల్ కళాశాల–2020 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ వైద్య వృత్తిని ప్రారంభించాక పేద వర్గాలకు తమవంతుగా సేవలు అందించాలని, అప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. కళాశాల చైర్మన్ సిద్దిఖీ, కళాశాల సెక్రటరీ జవ్వాద్ ఏక్యూ, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రసంగించారు. అనంతరం కళాశాల ఈడీ సలామన్ ముర్తుజా, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ మాట్లాడారు. కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
సాఫ్ట్ టెన్నిస్‌లో ప్రతిభ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈనెల 8, 9 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ టెన్నిస్ జూనియర్ బాలికల విభాగంలో కడప జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిందని సాప్ట్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రేవంత్ పేర్కొన్నారు. కడప జట్టు శ్రీకాకుళంపై 2–1 క్వార్టర్ ఫైనల్స్ గెలిచి సెమీఫైనల్‌లో గుంటూరు పైన 3–1 తో గెలుపొందిందన్నారు. ఫైనల్లో కృష్ణాజిల్లాపై 2–3 స్కోరుతో ఓటమి పాలైందన్నారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలో జిల్లా బాలికల జట్టు రెండో స్థానం సాధించిందన్నారు.
జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం
బద్వేలు అర్బన్ : స్థానిక మైదుకూరు రోడ్డులోని చెన్నంపల్లె సమీపంలో గల ఆర్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఆదివారం కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ్య సభ్యుడు టి.జి.వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరులక్ష్మయ్య, గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా వల్లంకొండువెంకటరమణ, సెక్రటరీగా సి.వి.నాగేశ్వర్‌రావు, ట్రెజరర్‌గా పబ్బతిచంద్రశేఖర్ తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ్య సభ్యుడు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టివెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్తూరురంగనాధ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.


