కడప సెవెన్‌రోడ్స్ : మెగా డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా మండిపడ్డారు. ఆదివారం కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై ఆడియో, వీడియో ఆధారాలను చూపెట్టినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీంతో నియోజకవర్గ స్థాయిలో మూడు రోజులపాటు రిలే దీక్షలు నిర్వహించామన్నారు. లోకేష్ భవితవ్యంపై నీలి నీడలు చోటుచేసుకోవడంతో సీఎం చంద్రబాబులో భ యం పుట్టిందన్నారు. అందుకే జమ్మలమడుగులో దీక్షా శిబిరంలో ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని అరెస్టు చేశారన్నారు. అలాగే విజయవాడలో మల్లాది విష్ణు, చిలకలూరిపేటలో విడుదల రజనిపై దౌర్జన్యాలకు పాల్పడి దీక్షల భగ్నానికి ఉపక్రమించడం శోచనీయమన్నారు. జెన్ జీ ఉద్యమం ప్రారంభమైందని, దీన్ని మొగ్గలోనే తుంచి వేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను 2–3 శాతానికి పెంచుతూ 24 గంటల్లోనే జీఓ ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. విశాఖ ఎంపీ భరత్ ఒక క్రీడా అసోసియేషన్ అధ్యక్షుడని, ఆయన సర్టిఫికెట్ ఇచ్చి న వారికి ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న యువత, విద్యార్థులను ముఖ్య మంత్రి గంజాయి బ్యాచ్‌తో పోల్చడం దారుణమన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ నిర్వహించి లోకేష్ నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.


