ఏ ‘నార’దిష్టి తగిలిందో ఏమోగానీ ఖరీఫ్ సీజనంతా నీటి చుక్క లేకుండానే గడిచిపోయింది. కరిమబ్బు హలధారితో దోబూచులాడింది.. ఆశగా ఎదురుచూసిన నేలతల్లికి సైతం నీటి తడి లేకుండా చేసింది.. అక్కడక్కడ చిరు జల్లులు మినహా వాన వెల్లువైంది లేదు.. ఏ ఒక్క నదిలోనూ ఝరి పారింది లేదు.. నల్లగా మబ్బు పట్టడం తప్పా చుక్క నీరు జారింది లేదు... ఇదిగో ఈ చిత్రాలే సాక్ష్యాలు.. గతేడాది జూలైలోనే రాజోలి ఆనకట్ట నిండుకుండలా మారి పరవళ్లు తొక్కింది. నీటి సవ్వడులతో...కర్షకుల కన్నీళ్లు, కష్టాలను తుడిచింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఒక్కసారీ పదును వాన పడింది లేదు. ఫలితంగా ఇదిగో ఇలా చుక్క నీరు లేక రాజోలి ఆనకట్ట వెలవెలబోతోంది. ఈ ఆనకట్ట నుంచి కేసీ ప్రధాన, కేసీ చాపాడు కాలువతో పాటు కుందూనది కింద దాదాపు 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కొందరు రైతులు మాత్రమే గుండె ధైర్యం చేసుకొని నీరు వస్తుందన్న ఆశతో నారు పోసి వరి నాట్లు కూడా వేశారు. అన్నదాతల ఆశలపై వరుణుడు నీళ్లు చిలకరిస్తాడో.. కరుణించి దోసిళ్లతో కుమ్మరిస్తాడో కాలమే సమాధానం చెబుతుంది.
– రాజుపాళెం


