కమలాపురంలో దీక్షలకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
కడపలో దీక్షలనుద్దేశించి ప్రసంగిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : డీఎస్సీ స్కాంపై ఉద్యమం ఇంతటితో ఆగిపోదని... కూటమి ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. డీఎస్సీ–2025 ప్రశ్నపత్రం లీకేజీ, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలో మూడు రోజుల పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారంతో ఈ రిలే దీక్షలను ముగించారు.
జిల్లా కేంద్రమైన కడప నగరంలోని దిశ పోలీసుస్టేషన్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ప్రారంభించారు. మైనార్టీ, బీసీ, వైఎస్సార్‌టీయూసీ, టీచర్స్ ఫెడరేషన్, మహిళా విభాగాల ఆధ్వర్యంలో మూడో రోజు దీక్షలు నిర్వహించారు. ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పులివెందుల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగాయి. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు దీక్షలకు తరలి వచ్చారు. వైఎస్ మధురెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులతోపాటు సింహాద్రిపురం, వేంపల్లి, వేముల మండలాలకు సంబంధించిన నాయకులు దీక్షల్లో కూర్చొన్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగాయి. శనివారం దీక్షల్లో మహిళా విభాగం నాయకులు 40 మంది పాల్గొన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ జ్యేష్టాది శారద, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ బి.లక్ష్మిదేవి, ఆప్కాబ్ మాజీ ఛైర్‌పర్సన్ మల్లేల ఝాన్సీరాణి తదితరులు దీక్షల్లో కూర్చొన్నారు. సాయంత్రం ఎస్‌ఈసీ సభ్యులు పోరెడ్డి నరసింహారెడ్డి, టంగుటూరి మారుతీ ప్రసాద్ వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
బద్వేలు పట్టణం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగాయి. ఈ దీక్షలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, నియోజకవర్గ పరిశీలకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు ఈ దీక్షల్లో కూర్చొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, ఎస్‌ఈసీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, సుందరరామిరెడ్డి పాల్గొన్నారు.
మైదుకూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఖాజీపేట మండలానికి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు కిరణ్మయి, ఖాజీపేట మండల అధ్యక్షులు మురళీ మోహన్‌రెడ్డి, రాఘవరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.
రాజంపేట పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. రాజంపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. సుండుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాలకు చెందిన నేతలు దీక్షల్లో కూర్చొన్నారు.
కమలాపురంలోని పార్టీ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలను పార్టీ జిల్లా అఽధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డితోపాటు అన్ని మండలాల వారు ఈ దీక్షల్లో కూర్చొన్నారు.


