రేపు అప్రెంటిస్‌షిప్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు అప్రెంటిస్‌షిప్‌ మేళా

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

రాజంపేట టౌన్‌ : పట్టణంలోని రెడ్డివారివీధిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ చెన్నా రామమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలలో రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో పాటు బెంగళూరు, చైన్నె రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ప్రతిభగల అభ్యర్థులను అప్రెంటిషిప్‌కు ఎంపిక చేసుకుంటారన్నారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడాది పాటు ఉండే అప్రెంటిషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్‌ ఇస్తుందని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రెండుసెట్ల జిరాక్స్‌ కాపీలు, రెండు ఫోటోలతో హాజరుకావాలని సూచించారు.

జిల్లాలో వర్షాలు

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో నాలుగు రోజుల నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఎర్రగుంట్లలో 16.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే సీకేదిన్నెలో 9.6, ఒంటిమిట్టలో 7.2, కడపలో 6.8, లింగాలలో 4.2, చక్రాయపేట, నందలూరు, సిద్దవటం, బిమఠంలలో 3.2, రాజుపాలెంలో 2.8, మైదుకూరులో 2.4, పెద్దముడియంలో 2.2, జమ్మలమడుగులో 1.4, ఖాజీపేటలో 1.2 మి.మీ వర్షం కురిసింది.

ఐఐసీటీ సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా ఎంపిక

కడప ఎడ్యుకేషన్‌ : యోగివేమన యూనివర్సిటీ భౌతికశాస్త్ర విభాగం నుంచి ఇటీవల డాక్టరేట్‌ అందుకున్న పార్నపల్లి ముని మౌనిక ప్రఖ్యాత కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సిఎస్‌ఐఆర్‌) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసిటి), హైదరాబాద్‌లో సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా ఎంపికయ్యారు. ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ ఎం.రాఘవేంద్ర పర్యవేక్షణలో ఈమె పరిశోధన పూర్తి చేశారు. మౌనిక ను వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ అభినందించారు.

ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం సీతారామలక్ష్మణులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు తులసి గజమాలలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రెండవ శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

నవోదయ గడువు పొడిగింపు

మదనపల్లె సిటీ : మదనపల్లె జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వతేదీ వరకు గడువు పెంచినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఎం.గీత తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 11న జరుగుతుందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నారు.

ఘనంగా యోగా పోటీలు

మదనపల్లె సిటీ : స్థానిక పీ అండ్‌ టీ కాలనీలోని నవ చైతన్య భారతి పాఠశాలలో శనివారం జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది బాల,బాలికలు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణు చైతన్య మాట్లాడుతూ యోగాతో మంచి శరీర ఆకృతిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని పొందొచ్చని తెలిపారు.కార్యక్రమంలో పరిశీలకులు మనోహర్‌, వెంకటరమణ, అనిత, జలజలు విజేతలైన క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు త్వరలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement